శనివారం అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతడి నెక్స్ట్ రిలీజ్ ‘తండేల్’ నుంచి ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీంతో పాటు చైతూ తర్వాత నటించబోయే సినిమా నుంచి ప్రి లుక్ పోస్టర్ వదిలారు. ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించబోతున్న సినిమా ఇది. ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా మిస్టిక్ థ్రిల్లర్ అనే విషయం పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ‘విరూపాక్ష’కు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామి అయిన కార్తీక్ గురువు సుకుమార్.. ఈ సినిమాతోనూ అసోసియేట్ అయ్యారు. ‘విరూపాక్ష’ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాదే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరో మారాడు తప్ప.. మిగతా టీం అంతా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. జానర్ కూడా అదే.
నిజానికి ‘విరూపాక్ష’ తర్వాత దాని సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తీక్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఐతే తర్వాత ‘విరూపాక్ష’ తరహాలోనే, అంతకంటే పెద్ద కాన్వాస్‌లో మిస్టిక్ థ్రిల్లర్ కథను తీర్చిదిద్దుకున్నాడు కార్తీక్. ఈసారి సుకుమార్ ‘పుష్ప-2’లో బిజీగా ఉండి, తీరిక లేకపోవడం వల్ల ఈ సినిమాకు స్క్రీన్ ప్లే బాధ్యతలేమీ తీసుకోలేదు. జస్ట్ కథ విని ఓకే చేశారు. చిన్న కరెక్షన్లు మాత్రమే చెప్పారు. ఈ కథ నాగచైతన్యకు బాగుంటుందని సూచించి.. తనతో మాట్లాడి ప్రాజెక్టు సెట్ చేసింది సుకుమారే.
‘పుష్ప-2’ పని పూర్తయ్యాక ఈ ప్రాజెక్టును సుకుమార్ పర్యవేక్షిస్తారు. ‘విరూపాక్ష’ ఏకంగా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం, చైతూ తర్వాతి చిత్రం ‘తండేల్’ ప్రామిసింగ్‌గా కనిపిస్తుండడంతో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పెద్ద సాహసమే చేయబోతున్నారు. ఈ సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. చైతూ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో ఒక విచిత్ర ప్రపంచంలోకి వెళ్లి రహస్యాన్ని ఛేదించే నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.