మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించబోతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు వెలువడిన ఫలితాలలో మహాయుతి కూటమి 288 స్థానాలకు గాను 218 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కేవలం 51 స్థానల్లో లీడ్ లో ఉంది. దీంతో, మరాఠా రాజకీయాల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఆ కూటమి అడుగులు వేస్తోంది. ఈ నెల 26న మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే కూడా తనకు మరోసారి సీఎం చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా…ఆయనను బీజేపీ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.
ఇక, ఝార్ఘండ్ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ మరోసారి ఆ రాష్ట ముఖ్యమంత్రి అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. సోరెన్ నేతృత్వంలోని జేఎఎం, కాంగ్రెస్ ల కూటమి 50 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. బీజేపీ కూటమి 29 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఝార్ఘండ్ లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీకి సోరెన్ గట్టి షాకిచ్చారు. తాజా ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల గెలుపు ఇచ్చిన ఊపుతో తెలంగాణలో దుమ్మురేపుతామని బండి సంజయ్ అన్నారు. త్వరలోనే తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని బండి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో అబద్దపు ప్రచారం చేసిన కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను కూడా ఎండగడతామని అన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతాయని సెటైర్లు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు మొదలుకాబోతున్నాయని, ఆ పార్టీని పడగొట్టే అవసరం బీజేపీకి లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను కూల్చుకుంటారని చెప్పారు.