వలంటీర్లు.. ప్రతి నెలా 1నే సూర్యోదయానికి ముందే తలుపు తట్టి లబ్ధి దారులకు పింఛను అందించి.. వారి మన్ననలు పొందారు. ఇంట్లో కరెంటు పోయినా.. నీళ్లు సమయానికి రాకపోయినా.. అవసరమైన ఏ పని కావాలన్నా.. వలంటీర్లకు పోన్లు వెళ్లేవి. ప్రభుత్వం ఏది ఉన్నా.. నిజాలను మాత్రం ఎవరూ కాదనలేరు. ఈ విషయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామే చెప్పుకొచ్చారు. వారి సేవలను తక్కువ చేయడం లేదన్నారు.
కానీ, ఇప్పుడు వలంటీర్లు మాత్రం రోడ్డున పడ్డారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆటలో అరటిపండ్లుగా మారిపోయారు. వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ వ్యవస్థను గొప్పగా చెప్పుకొన్న జగన్.. తన మానసపుత్రికగా పేర్కొన్న జగన్.. వారిని రెన్యువల్ చేయడం వేసిన తప్పటడుగు ఇప్పుడు వారిని ఉపాధికి దూరం చేసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం.. 2023, సెప్టెంబరులోనే వలంటీర్ల రెన్యువల్ను నిలిపేశారని తెలుస్తోంది.
ఇదే నిజమైతే (అసెంబ్లీలో చెప్పారు కనుక నిజమేనని భావించాలి) తాను వేసిన వలంటీర్ అనే మొక్కను జగనే నరికేశారని అనాలి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా ఆరేడు మాసాల సమయం ఉందనగానే.. వలంటీర్ల వ్యవస్థను ఆయన పునరుద్ధరించుకుండా అడ్డుకున్నట్టు అయింది. ఇక, ఎన్నికల సమయంలో చంద్రబాబు వారికి రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పటి వరకు వారికి ఉపశమనం కలగలేదు. పైగా అసలు ఈ వ్యవస్థలేదని.. జగన్ పునరుద్ధరించలేదని కూడా చెబుతున్నారు.
సో.. ఎలా చూసుకున్నా.. జగన్ చేసిన తప్పుతో వలంటీర్ ఇప్పుడు ఆటలో అరటిపండుగా మారిపోయారు. ఇంత జరుగుతున్నా.. అసలు వ్యవస్థలేదని అంటున్నా.. జగన్ నోటి నుంచి ఒక్క మద్దతు మాట రాకపోవ డం.. వలంటీర్లను మరింత కుంగదీస్తోంది. కనీసం వారికి మేమున్నాంటూ ఒక్కమాట కూడా ఆయన చెప్పలేకపోయారు. పోనీ.. వలంటీర్లను పునరుద్ధరించారా? లేదా? అన్న విషయాన్ని కూడా వెల్లడించక పోవడం మరో కీలక అంశం. ఏదేమైనా.. జగన్ చేసిన తప్పుతో 2.3 లక్షల మంది యువతీయువకులు రోడ్డున పడ్డారనే చెప్పాలి.