గత కొంతకాలం నుంచి సినీ పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద హిట్టా? ఫట్టా? అన్నది పక్కన పెడితే ఇప్పటివరకు ఎందరో ప్రముఖుల బయోపిక్స్ వెండితెరపై ప్రత్యక్షమయ్యాయి. ఈ క్రమంలోనే సామాన్య స్థాయి నుంచి అసమాన్య స్థాయికి ఎదిగిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ తీయాలని కొందరు దర్శకులు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తన తండ్రి బయోపిక్ తీసేందుకు నాగార్జున మాత్రం ఇష్టపడటం లేదు.
వెండితెరపై ఏఎన్ఆర్ బయోపిక్ చాలా బోరింగ్ గా ఉంటుందని నాగార్జున తాజాగా అభిప్రాయపడ్డారు. గోవాలో అట్టహాసంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఫ్యామిలీతో సహా నాగార్జున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం `సెంటినరీ స్పెషల్ ఏఎన్ఆర్: సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు` పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఆర్ బయోపిక్ గురించి ప్రస్తావన రాగా.. నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి జీవితాన్ని సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తేనే బాగుంటుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. బయోపిక్ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో సాధించిన విజయాలు, ఆ విజయాలు వెనకున్న కష్టాలు, ఆ కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, ఎత్తుపల్లాలు ఇలా అన్ని చూపిస్తేనే ఎమోషన్స్ పండుతాయి. కానీ నా తండ్రి జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడూ ఆయన ఎదుగుగల హై రేంజ్లోనే ముందుగా సాగింది. అటువంటి వ్యక్తి జీవితాన్ని బయోపిక్ తీస్తే ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతారు. అందుకే కొన్ని కల్పితాలు జోడించి డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందని నాగార్జున చెప్పుకొచ్చారు.