ఏపీ మాజీ సీఎం జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు శాసన సభ సమావేశాల చివరి రోజు జగన్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నా ఫ్రెండ్ కాదు…ఏమీ కాదు అంటూ వ్యాఖ్యానించారు. చాలామంది మిత్రులు తనకు ఫోన్ చేసి జగన్ మీ మిత్రుడేగా అంటుంటారని, కానీ, ఆయన తన మిత్రుడు కాదని చెప్పారు.
పేపర్లు చూస్తే మీ జగన్ మోహన్ రెడ్డి అని రాస్తుంటారని..ఆయన ఏదో నా చుట్టంలాగా అంటూ విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు…నువ్వు మీ జగన్ మోహన్ రెడ్డి బాగుంటారు కదన్నా అని అడుగుతుంటారని చమత్కరించారు. ఏం ఫ్రెండు..ఫ్రెండు కాదు ఏమీ కాదు..5 సంవత్సరాల నుంచి పేమెంట్స్ ఇవ్వకుండా సర్వనాశనం చేశాడు నన్ను జగన్ మోహన్ రెడ్డి అని చెబుతుంటానని అన్నారు. ఫ్రెండు లేదు నా బొ..లేదు అధ్యక్షా..సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ అధ్యక్షా అంటూ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలకు సభలో సీఎం చంద్రబాబుతోపాటు మిగతా సభ్యులంతా నవ్వుకున్నారు.
కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలలో జగన్ పై విష్ణుకుమార్ రాజు పలుమార్లు షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలోని రుషికొండపై 500 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసి ప్యాలెస్ కట్టిన జగన్ ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పు లేదంటూ ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఐదేళ్లలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుడా జగన్ ముప్పుతిప్పలు పెట్టారని, తాను కాంట్రాక్టర్ అయి ఉంటే పది సార్లు ఆత్మహత్య చేసుకునేవాడినని సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ నా ఫ్రెండ్ కాదు..బొ..కాదు అంటే ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.