మంగళవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరుకావాల్సి విచారణకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు రాలేనంటూ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ చేశారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి వర్మ పెట్టిన పలు పోస్టులు వివాస్పదం అయ్యాయి. ఈ విషయంపై ఇటీవల టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ వెళ్లి మరీ ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ నుంచి రక్షించాలని, తనపై నమోదైన కేసును కొట్టేయాలని వర్మ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం ఆ పిటిషన్ ను తిరస్కరించింది. అరెస్ట్ భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
హైకోర్టులో షాక్ తగలడంతో వర్మ విచారణకు వస్తారా? లేదా? అన్న సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర పడింది. ఉదయం పది గంటల ప్రాంతంలో తాను విచారణకు రాలేనని ఆర్జీవీ వాట్సాప్ ద్వారా రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు మెసేజ్ చేశారు. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు సహకరిస్తానని.. కానీ ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని వర్మ తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత తప్పకుండా విచారణకు హాజరవుతానని వర్మ చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. వాట్సాప్ మెసేజ్ నేపథ్యంలో వర్మ నిజంగా షూటింగ్ లో బిజీ ఉన్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.