మహానటి మూవీతో జాతీయస్థాయిలో స్టార్ హోదా ను అందుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కనుందంటూ గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు కీర్తి సురేష్ పెళ్లి పై వార్తలు రాగా.. వాటిని ఆమె తల్లిదండ్రులు కొట్టి పారేశారు. ఈసారి కూడా కీర్తి సురేష్ పెళ్లి పై వస్తున్న న్యూస్ రూమర్ గానే అందరూ భావించారు.
కానీ కీర్తి సురేష్ పెళ్లి వార్త నిజమే అని నేషనల్ మీడియా చెబుతోంది. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్ తో కీర్తి సురేష్ ఏడడుగులు వేయబోతోందట. డిసెంబర్ 11న గోవా వేదికగా ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆంటోనీ విషయానికి వస్తే.. అతను కేరళలోని కొచ్చికి చెందిన వ్యక్తి. దాదాపు దశాబ్దం కాలం నుంచి దుబాయ్ లో ఆంటోనీ వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మాన్ గా ఎదిగాడు.
ఆంటోనీతో చాలా ఏళ్ల నుంచి కీర్తి సురేష్ ప్రేమాయణం నడుపుతోంది. కానీ ఎక్కడ ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఇటీవల వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారట. డిసెంబర్ రెండో వారంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివేది అనే చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. అలాగే బేబీ జాన్ మూవీతో త్వరలోనే కీర్తి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.