తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేరన్న వార్త తమ కుటుంబంలో విషాదాన్ని నింపిందన్నారు. చిన్నాన్నతో చిన్ననాటి అనుబంధం కళ్ల ముందు కదిలాడిందని, కన్నీటితో నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ తమ కంటికి కనిపించే ధైర్యం అని, నేటి నుంచి చిరకాల జ్ఞాపకం అని లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని లోకేష్ కోరారు.
మరోవైపు, రామ్మూర్తి నాయుడు మృతి పట్ల టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, రామ్మూర్తి నాయుడు మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మంత్రి నిమ్మల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నామన్నారు.