ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కాబట్టి వారు సభకు రావడం లేదు. దీంతో, సమావేశాలు చప్పగా సాగుతున్నాయి అనుకున్నారో ఏమో…సభలో ప్రతిపక్ష పార్టీ లేని లోటును టీడీపీ సభ్యులే తీరుస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న ప్రొటెం స్పీకర్ రఘురామ వర్సెస్ జ్యోతుల నెహ్రూ ఎపిసోడ్ వైరల్ గా మారింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే సభలో స్పీకర్ అయ్యన్న వర్సెస్ కూన రవి కుమార్ ఎపిసోడ్ నేడు సభలో చర్చనీయాంవమైంది.
జీరో అవర్ లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలను ఏ మంత్రి నోట్ చేసుకోవడం లేదని, దీంతో, డ్రైవర్ లేని కార్ మాదిరిగా జీరో అవర్ మారిందని కూన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే, ఆ ప్రశ్నలు రికార్డు అవుతున్నాయని మంత్రి అచ్చెన్న అన్నారు. రికార్డు ఆటోమేటిక్ గా అవుతుందని, కానీ, మంత్రులు రెస్పాండ్ కావాలని అయ్యన్న సూచించారు.
అయితే, సదరు సమస్యకు సంబంధించిన మంత్రి లేచి నిలబడి సమస్యను నోట్ చేసుకున్నామని చెప్పే సంప్రదాయం గతంలో ఉందని, ఇప్పుడు లేదని కూన అన్నారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలు, సమస్యలు నోట్ చేసుకొని వారికి సమాధానం, సమాచారం ఇస్తారని అచ్చెన్న అన్నారు. అయితే, కూన రవి చివర్లో కూర్చుంటారు కాబట్టి ముందు ఏం జరుగుతోందో ఆయనకు తెలీదంటూ అయ్యన్న సమాధానమిచ్చారు.
ఇక, సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభకు లేటుగా రావడంపై ప్రొటెం స్పీకర్ రఘురామ సెటైర్లు వేశారు. గోరంట్ల వంటి సీనియర్ సభ్యులు ఆలస్యంగా వచ్చినా వారికి తగినంత సమయం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్ గా తనపై ఉందని, త్వరగా ముగించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని రఘురామ సెటైరికల్ గా చెప్పారు. ఇక, మంత్రులు ఆలస్యంగా రావడంపై అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా సభలో టీడీపీ సభ్యులు, స్పీకర్ ల మధ్య జరుగుతున్న సంభాషణలు చూస్తుంటే టీడీపీ సభ్యుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సభావ్యవహారాలపై చంద్రబాబు ఫోకస్ చేసి ఈ తరహా ఎపిసోడ్లకు చెక్ పెట్టకుంటే పార్టీలో లుకలుకలున్నాయని జనం అనుకునే అవకాశముందని నెటిజన్లు అంటున్నారు.