ఏపీ సీఎం చంద్రబాబుకు సోదర వియోగం కలిగింది. ఆయన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు శనివారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఆయన 1994, 1999 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. చంద్రబాబు అప్పటి మంత్రివర్గంలో సీటును ఆశించినా దక్కలేదు.
దీంతో ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు విభేదాలు కొనసాగాయి. అనంతర కాలంలో రామ్మూర్తినాయుడు కొన్నా ళ్లు కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వ్యూహంలో రామ్మూర్తినాయుడు భాగంగా మారారన్న విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి. ఒకానొక సందర్భంగా చంద్రబాబు పాలనపై కూడా రామ్మూర్తి విమర్శలు గుప్పించారు. ఇక, ఆ తర్వాత.. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లొని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఏకైక కుమారుడు నారా రోహిత్ సినీ నటుడిగా, హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇదిలావుంటే, రామ్మూర్తి నాయుడి పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా తన పర్యటనను అర్థంతరంగా రద్దు చేసుకుని హైదరాబాద్కు పయనమయ్యారు. వాస్తవ షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు శనివారం మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉంది. కానీ, సోదరుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చంద్రబాబు అన్ని షెడ్యూళ్లను రద్దు చేసుకున్నారు.