నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతలను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు. హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ అనంతరం ప్రశాంత్ వర్మ నుంచి రాబోతున్న ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాస్టింగ్ ఎంపికలో బిజీ బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. కథలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం చాలా మంది పేర్లను పరిశీలించి ఫైనల్ గా ఓ స్టార్ హీరో తనయుడితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇంతకీ అతను మరెవరో కాదు.. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్.
అర్జున్ రెడ్డి రీమేక్ తో ధృవ్ హీరోగా కోలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో హీరోగా సత్తా చాటుతున్న ధృవ్ విక్రమ్.. మోక్షజ్ఞ మూవీలో విలన్ గా అలరించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది తమిళ హీరోలు తెలుగులోనూ మంచి గుర్తింపు, భారీ మార్కెట్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ ఆఫర్ కు ధృవ్ పాజిటివ్ గా స్పందించాడని టాక్ నడుస్తోంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. మోక్షజ్ఞ కు జోడిగా రవీనా టండన్ వారసురాలైన రషా థడానీని ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి.