వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు భూ అక్రమాలకు పాల్పడిన వైనంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వందల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆరోపించాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతం రెడ్డి పై తాజాగా భూ ఆక్రమణతో పాటు హత్యకు పథక రచన చేశారన్న ఆరోపణలు రావడం కలకలం రేపింది.
విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రి అనే పూజారి భూమిని కబ్జా చేసిన గౌతమ్ రెడ్డి ఆ క్రమంలోనే ఆయనను హత్య చేయాలని సుపారీ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఉమామహేశ్వర శాస్త్రిపై ఇటీవల జరిగిన దాడి వెనుక గౌతమ్ రెడ్డి ఉన్నట్లుగా పోలీసులు విచారణలో నిర్ధారించుకున్నారు. ఉమామహేశ్వర శాస్త్రిని చంపేందుకు గౌతమ్ రెడ్డి కుట్రపన్నారని, ఈ క్రమంలోనే కిరాయి హంతకులతో 25 లక్షల రూపాయల సుపారీ డీల్ కూడా కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు.
తన స్థలం కబ్జాకు గురైందని ఉమామహేశ్వర శాస్త్రి మీడియా కార్యాలయాలు, కోర్టులు, పోలీసులు చుట్టూ తిరుగుతున్నారని, అందుకే అతడి అడ్డు తొలగించుకోవాలని గౌతంరెడ్డి భావించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చిన కిరాయి గుండాలు శాస్త్రి పై రెండుసార్లు దాడికి ప్రయత్నించారని, విచక్షణ రహితంగా కొట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గౌతమ్ రెడ్డిని పోలీసులు చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి కడపలో గాని నెల్లూరులోగాని తలదాచుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.