వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసును ఐదేళ్లపాటు సీరియల్ మాదిరిగా జగన్ ప్రభుత్వం సాగదీసిన సంగతి తెలిసిందే. వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఆ హత్యలో ఉందంటూ సాక్షాత్తు వివేక కూతురు సునీత రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. ఇక, అవినాష్ రెడ్డిని దాదాపుగా అరెస్టు చేసే వరకు వెళ్లిన సిఐడి అధికారులు చివరకు అరెస్ట్ చేయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలా తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తన తండ్రి హత్యకు కారకులైన నిందితులకు శిక్ష పడలేదని, ఈ కేసు ఓ కొలిక్కి రాలేదని సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలోనే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితను సునీత కలిసి ఈ కేసు గురించి కొద్ది రోజుల క్రితం చర్చించారు. ఈ క్రమంలోనే తాజాగా కడప ఎస్పీ విద్యా సాగర్ ను సునీత కలిసి వివేక కేసు గురించి చర్చించారు.
హంతకులకు శిక్షపడేలాగా పోలీసుల విచారణ వేగవంతం చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. దాంతోపాటుగా తనపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రవీంద్రారెడ్డి పెట్టిన అభ్యంతర పోస్టులపై కూడా ఎస్పీతో ఆమె చర్చించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకు ఐదేళ్లపాటు ఈ కేసును జగన్ నత్త నడకన సాగించారని తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీతోపాటు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీత ఈ కేసు స్పీడు పెంచారని తెలుస్తోంది.