ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ఎంట్రీకి బిగ్ స్క్రీన్ స్టార్స్ కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పవర్‌హౌస్ గా పేరుగాంచిన సమంత.. ఓటీటీలో బాలీవుడ్ తారలనే మించిపోయి రెమ్యునరేషన్ విషయంలో సంచలనం సృష్టించింది. ఇండియన్ ఓటీటీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే నటిగా అవతరించింది.
టాలీవుడ్, కోలీవుడ్ లో దశాబ్దం పాటు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన సమంత.. ఇటీవల కాలంలో వ్యక్తిగత మరియు ఆరోగ్య సమస్యల కారణంగా డల్ అయింది. గత రెండేళ్ల నుంచి ఆమె ఖాతాలో సరైన హిట్ పడలేదు. అయినప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా డిజిటల్ రంగంలో ఆమెకు భారీ డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా రాజ్ & డీకే రూపొందించిన స్పై-థ్రిల్లర్ `సిటాడెల్: హన్నీ బన్నీ`తో నార్త్ ప్రేక్షకులను సమంత పలకరించింది.
ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయింది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా.. అక్షరాల రూ. 10 కోట్లు. ఇంతవరకు బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఈ ఫిగర్ ను టచ్ చేయలేకపోయారు. దీంతో ఇండియాలోనే హైయెస్ట్ పెయిన్ ఓటీటీ యాక్ట్రస్ గా సమంత నయా రికార్డు ను సెట్ చేసింది.