ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ల మధ్య ఆస్తి తగాదా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ విజయమ్మ ఎంట్రీతో ఈ ఆస్తి పంచాయతీ కీలక మలుపు తిరిగింది. ఆస్తి ఇద్దరిదని, ఇద్దరికీ సమానం అని విజయమ్మ రాసిన లేఖ వైరల్ గా మారింది. అయితే, జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ రాజకీయ ప్రత్యర్థులతో షర్మిల చేతులు కలిపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. జగన్ మోహన్ రెడ్డిగారి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని వైసీపీ అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని షర్మిల సెటైర్లు వేశారు.
ఆ ఆస్తుల వ్యవహారంలో ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని, 32 కోట్ల రూపాయల విలువైన కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని షర్మిల క్లారిటీనిచ్చారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. స్టేటస్ కో ఉన్నది షేర్ల మీద కాదన్న విషయం వైసీపీ నేతలు గుర్తించాలని చురకలంటించారు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినా వాటి షేర్లు, స్టాక్ మార్కెట్ లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని గుర్తు చేశారు. 2016లో భూములను ఈడీ అటాచ్ చేసిన కారణంతో షేర్ల బదిలీ చేయకూడదని వైసీపీ నేతలు చెప్పడం వింతగా ఉందని, హాస్యాస్పదంగా కూడా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు.
ఓ వైపు విజయమ్మ రాసిన లేఖతో జగన్ ఇరకాటంలో పడ్డట్లయింది. స్వయంగా విజయమ్మ ఆస్తి పంపకాలపై పెదవి విప్పడం, ఆ పంపకాల విషయానికి ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు సాక్ష్యమని చెప్పండంతో వైసీపీ నేతలు , జగన్ ఖంగుతిన్నారు. ఇంతలోనే ఈడీ షేర్లు అటాచ్ చేయలేదని షర్మిల తేల్చి చెప్పడంతో వైసీపీ నేతలు, జగన్ మరింత ఇరకాటంలో పడ్డట్లయింది. మరి, షర్మిల కామెంట్లపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.