సూపర్ స్టార్ మహేష్ బాబును కృష్ణుడి పాత్రలో చూడాలని అభిమానుల ఆశ. తరచుగా దీని గురించి ఓ చర్చ జరుగుతూ ఉంటుంది. ‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడిగా పెద్దగా పేరు లేని ఒక నటుడిని పెట్టి ముఖం కనిపించకుండా ఆ పాత్రను చూపించాడు నాగ్ అశ్విన్. దాని బదులు మహేష్ బాబును ఆ క్యామియో కోసం తీసుకుని ఉంటే సినిమాకు పెద్ద అట్రాక్షన్ అయ్యేవాడని అభిమానులు అభిప్రాయపడ్డారు.
సెకండ్ పార్ట్‌లో అలా చూపించే ఉద్దేశం ఏదైనా ఉందా అంటే నాగ్ అశ్విన్ నో చెప్పేశాడు. కాగా మహేష్ ఇప్పుడు వేరే సినిమాలో కృష్ణుడి పాత్రలో కాసేపు కనిపించబోతున్నాడని ప్రచారం మొదలైంది. మహేష్ సోదరి తనయుడైన గల్లా అశోక్ హీరోగా ‘దేవకీ నందన వాసుదేవ’ అన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ కృష్ణుడి పాత్రలో మెరవబోతున్నాడని రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
కానీ యూనిట్ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ రూమర్ నిజం కాదట. మహేష్ ఈ సినిమాలో క్యామియో ఏదీ చేయలేదని స్పష్టమైంది. అశోక్ ఎంత దగ్గరి బంధువు అయినా సరే.. మహేష్ బాబు స్థాయి నటుడు ఓ చిన్న సినిమాలో క్యామియో చేయడం, అది కూడా కృష్ణుడి పాత్ర అంటే నమ్మశక్యంగా అనిపించదు. తన ఫ్యామిలీ హీరోస్ ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే ప్రమోషన్ పరంగా మాట, చేత సాయం చేస్తాడు కానీ.. ఇలా క్యామియోలు చేయడం మహేష్‌కు అలవాటు లేదు.
ఆ రకంగా ప్రేక్షకులను మభ్య పెట్టాలని చూడడు మహేష్. కాబట్టి ఈ క్యామియో గురించి జరిగింది ఉత్తుత్తి ప్రచారం అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ టీమ్ ఈ సినిమాకు హైప్ పెంచడానికి ఈ రూమర్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.