“నా జైలు జీవితం గురించి ఎవరైనా ఓ పుస్తకం రాయొచ్చు“ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. జైల్లో గడిపిన క్షణాలను తలుచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ జైలుకు వెళ్తానని అనుకోలేదని తెలిపారు. 53 రోజుల పాటు అత్యంత దారుణ స్థితిలో జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. తనపై నిఘా కూడా పెట్టారని.. ఆ జీవితాన్ని ఒక పుస్తకంగా ఎవరైనా రాయొచ్చని తెలిపారు.
కూటమి కట్టే వాళ్లం
జైల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి తనకు భరోసా కల్పించినట్టు చంద్రబాబు చెప్పారు. ఆయనకు, తనకు మధ్య కేవలం రెండే నిమిషాలు చర్చలు జరిగాయన్నారు. ఆ సమయంలో అన్నీ ఆలోచించుకుని పొత్తులకు సిద్ధపడాలని సూచించానని.. పొత్తుల విషయాన్ని తానే స్వయంగా ప్రస్తావించానని చంద్రబాబు చెప్పారు. అయితే.. బయటకు వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ పొత్తులపై సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినట్టుతెలిపారు. ఇక, తాను జైలుకు వెళ్లినా.. వెళ్లకపోయినా.. బీజేపీ-జనసేన-టీడీపీలు కలిసే ఎన్నికలకు వెళ్లి ఉండేవని అన్నారు.
తప్పు చేయలేదు!
తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పారు. అయితే.. కాలం కలిసి రానప్పుడు పరీక్షలు ఎదురవుతాయ న్నారు. తన జీవితంలోనూ అదే జరిగిందన్నారు. కనీసం.. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా ఎవరూ చెప్పలేదని తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు మార్గంలో తిప్పి.. చివరకు రాత్రి సమయంలో కోర్టులో హాజరు పరిచారని.. అక్కడ నుంచే జైలుకు తరలించాలని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు.. దేశ విదేశాల్లోని తెలుగు వారు స్పందించిన తీరు.. తనకు భరోసా కల్పించిందన్నారు. తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదని తెలిపారు.
వాళ్లను వదలను
తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని చంద్రబాబుచెప్పారు. అయితే.. తప్పు చేయని వారిని మాత్రం తాను ముట్టుకోనన్నా రు. తన సుదీర్ఘ రాజకీయాల్లో ఎప్పుడూ కక్ష పూరిత రాజకీయాలు చూడలేదని.. కానీ, గత ఐదేళ్లలో మాత్రం కక్ష పూరిత రాజకీయాలు సాగాయని.. ఇవి తనను ఎంతో కలచి వేశాయన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక.. కుటుంబానికి సమయం ఇవ్వలేదని.. ప్రజల కోసమే ఎక్కువగా సమయం వెచ్చించానని చంద్రబాబు తెలిపారు. మొదటిసారిగా జైలులో అడుగుపెట్టిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.