అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఎంగిలాకు ఎగిరెగిరి పడుతుంది.
రాజకీయ రంగంలో ప్రత్యర్థులుగా కొన్ని దశాబ్దాల పాటు సమరం సాగించిన ఇద్దరు నేతల పిల్లల గురించి రెండే ముక్కల్లో చెప్పాలంటే ఇలాగే చెప్పొచ్చు.
ఆ ఇద్దరిలో ఒకరు.. నవ్యాంధ్ర భవితను తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను భుజాలకెత్తుకున్న అలుపెరగని శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్.
రెండో నాయకుడి పేరు గురించి.. ఆ ‘మహా మేత’ కుమారుడు రాష్ట్రానికి పట్టిన శనిలా సాగించిన ఐదేళ్ల ప్రజా కంటక పాలన గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు.
లోకేష్ గురించి చెప్పాలంటే..
సమర్థులైనవాళ్లెప్పుడూ అనవసరమైన సడి చేయరు!
వాళ్లు చేసే పనే వారి సత్తా ఏమిటో తెలుపుతుంది.
వారి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ప్రదర్శిస్తుంది.
లోకేష్ నైజానికి అక్షరాలా సరిపోయే నిత్యసత్యాలివి.
రాష్ట్ర విభజన జరిగి.. నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక కొలువుదీరిన తొలి ప్రభుత్వంలో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన చేసిన సేవల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అత్యంత మారుమూల గ్రామాల్లో సైతం ఆయన హయాంలో వేయించిన సీసీ రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆయన హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలకు లెక్కే లేదు. ఎంత మంచి చేసినా.. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్‌ను ప్రజలు ఓడించారు.
‘ఒక్క చాన్స్’ అంటూ ఏడుపుగొట్టు ముఖంతో వచ్చిన ఒక మేకవన్నెపులి మాటలు నమ్మి.. లోకేష్‌ను ఓడించడం ద్వారా తమను తాము ఓడించుకున్నారు. నిజానికి టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు ఏపీవ్యాప్తంగా బోలెడున్నాయి. కానీ వాటి నుంచి పోటీ చేయలేదు లోకేష్. అంతెందుకు.. అధినేత కుమారుడు పోటీ చేస్తానంటే సీటు ఖాళీ చేసిచ్చే నమ్మకస్తులైన నేతలూ టీడీపీలో బోలెడుమంది ఉన్నారు. తాను ఎంపీగా పోటీ చేయడానికి.. అప్పటికే ఆ సీటులో ఉన్న బాబాయిని రాజీనామా చేయాలంటూ కొట్టిన ‘పులివెందుల పిల్లి’ లాగా దుర్మార్గుడిలా వ్యవహరించలేదు లోకేష్.
కొన్ని దశాబ్దాలుగా పార్టీకి గెలుపన్నదే ఇవ్వని మంగళగిరి నియోజకవర్గాన్ని మగాడిలా ఎంచుకుని పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. భీరువులా కుంగిపోలేదు. ధీరుడిలా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. ఓడిపోవడమంటే ఆగిపోవడం కాదని.. మరింత గొప్పగా పనిచేస్తూ విజయం దిశగా సాగడమని ప్రపంచానికి చాటిచెప్పారు. అధికార వైసీపీ అరాచకాలతో భయభ్రాంతులకు గురైన కేడర్‌కు అడుగడుగునా ధైర్యం నూరిపోస్తూ.. 226 రోజులపాటు 3,132 కిలోమీటర్ల ‘యువగళం’ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ విజయానికి బాటలు పరిచారు.
అన్నింటికీ మించి.. పార్టీ భవిష్యత్తుపైన, తదుపరి తరం నాయకత్వంపైన తీవ్ర ఆందోళనతో ఉన్న కార్యకర్తలకు.. ‘నేనున్నా’నంటూ అంతులేని భరోసా ఇచ్చారు. ఓడినచోటే 90 వేల మెజారిటీతో గెలిచి తనను తాను నిరూపించుకున్నారు. సగర్వంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన ప్రవాస తెలుగువారిని కలిసేందుకు.. గత పాలనలో రాష్ట్రానికి అయిన గాయాలను మాన్పే ఆర్థిక ఔషధంగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు.. అమెరికాకు వస్తున్న నారా లోకేష్గారికి ‘నమస్తే ఆంధ్ర’ హృదయపూర్వక స్వాగతం.
– సాగర్ దొడ్డపనేని, ఎడిటర్, నమస్తే ఆంధ్ర