కోపం ఉండాలే. కానీ.. అందులో న్యాయం ఉండాలి. ఆగ్రహం ఉండాలి. ధర్మాగ్రహమైతే మంచిది. ప్రజలకు సేవ చేయటానికి.. ప్రజల బతుకుల్ని మార్చేందుకు రాజకీయం చేసే రాజకీయ అధినేతకు డబ్బులు పెద్ద విషయమా? పదవులు.. పవర్ ముఖ్యమా? అంటే.. రెండోదే. అయినా.. ఎవరికో ఆస్తి ఇచ్చేస్తే ఇబ్బంది. కానీ.. సొంత చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిని ఇస్తే వచ్చే సమస్యేంది? అయినా.. డబ్బులు సంపాదించటానికి బోలెడన్ని మార్గాలు ఉండి.. కోట్లాది మంది వెనుక ఉన్నప్పుడు.. ఆస్తిలో వాటా ఇవ్వటానికి వచ్చే ఇబ్బందులు ఏమిటన్నది జగన్ కు మాత్రమే తెలియాలి.
నిజమే.. అధికారంలో వైఎస్ అయినప్పటికీ.. ఆయన సంపాదించింది తక్కువే. కానీ..ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి చేతికి పవర్ లేకపోవచ్చు. కానీ.. ఆస్తులు కూడబెట్టారు. అయితే.. అందుకు కర్త.. కర్మ.. క్రియ అన్నీ వైఎస్సార్ అన్నది బహిరంగ రహస్యం. అలాంటప్పుడు తండ్రి కారణంగా వచ్చిన ఆస్తిని.. ఆయన అభిలాషకు తగ్గట్లే వాటాలు పంచితే పోయేదేముంది? తన సోదరి షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తి వాటా విషయం ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యే ఉంటే.. కొద్దికాలం క్రితం కోర్టు.. కేసుల వరకు వెళ్లటం.. అది కాస్తా బయటకు రావటం.. సంచలనంగా మారటం తెలిసిందే.
ప్రజా నాయకుడిగా డబ్బులు కంటే.. ఇమేజ్ చాలా ముఖ్యం. అది ఉన్నంతవరకు ప్రజల్లో ఉండేఅభిమానం వేరే ఉంటుంది. ఈ విషయాన్ని జగన్ ఎక్కడో మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. రాజకీయంగా దారులు వేరు అయినప్పటికీ.. ఒప్పందం ప్రకారం ఆస్తులు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వని తత్త్వం తనను డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అయ్యారు? తెనాలికి చెందిన దళిత మహిళ సహాన దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఆమెను పరామర్శించేందుకు బుధవారం వెళ్లిన జగన్.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఒక దళిత చెల్లికి జరిగిన దారుణానికి తాను ఎంతలా కదిలిపోయానన్న భావన కలుగజేసేలా వ్యవహరించిన జగన్.. ఆ సందర్భంగా కూటమి సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఇదంతా చూసిన వారికి జగన్ తీరును హర్షించకుండా ఉండలేరు. కానీ.. సమస్యంతా ఎక్కడ వస్తుందంటే.. ఈ నిర్ణయాన్ని ప్రకటించటానికి కొన్ని గంటల ముందు నుంచి జగన్ తన సోదరితోనూ.. తల్లితోనూ ఆస్తి విషయంలో విభేదించటమే కాదు.. వారిపై కేసు వరకు వెళ్లారన్న వార్త విన్నప్పుడే విస్మయానికి గురి కావాల్సి వస్తుంది. ఓవైపు దళిత చెల్లికి అన్యాయం జరిగిందంటూ ఉదారంగా రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించి పెద్ద మనసున్న పెద్దమనిషిగా కనిపించి.. అదే సమయంలో తండ్రి (ఆ తండ్రి సాదాసీదా అయితే ఫర్లేదు. వైఎస్సార్ అనే మహానేత అయినప్పుడు) చెప్పిన మాటకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఆస్తి కోసం కన్నతల్లి.. సొంత చెల్లి మీద కేసు వరకు వెళ్లిన వైనం చూసినప్పుడు..ఇవేం వేరియేషన్స్ జగన్? అనుకోకుండా ఉండలేరు.
ఒక దళిత చెల్లికి రూ.10 లక్షలు ఇచ్చేందుకు వెనుకాడని జగన్.. సొంత చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి విషయంలో మొండిచేయి చూపటమేంటి? అన్న ప్రశ్న వెంటాడుతుంది. ఇది చేసే డ్యామేజ్ చాలా ఎక్కువన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఆస్తులు ఇవాళ ఉండొచ్చు. రేపు పోవచ్చు.. ఎల్లుండి అంతకుమించి రావొచ్చు. కానీ.. వైఎస్సార్ వారసుడికి ఉండాల్సిన ఇమేజ్ ను జగన్ ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేవారెవరు?