వైసీపీలో మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన చాలా వ్యూహాత్మక నిర్ణయం ప్రకటించారు. గత నాలుగు రోజులుగా వైసిపి వర్క్ షాప్ పేరుతో ఆయన జిల్లా నాయకులతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాయకులు కూడా తమ సమస్యలు చెప్పుకొచ్చారు. జిల్లాకి ఒక నెల కేటాయించాలని ఆ నెల రోజులపాటు జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, వైసీపీని బలోపేతం చేసే దిశగా తీసుకోవలసిన అంశాలు, కార్యకర్తల పనితీరు, అదే విధంగా నేతల పనితీరును కూడా అంచనా వేయాలని నాయకులు పేర్కొన్నారు.
దీనికి జగన్ కూడా ఒకే చెప్పారు. ఇది అంత తేలికకాదు. జిల్లాల సమీక్ష పేరుతో నాయకుల వ్యూహం వేరేగా ఉంది. వైసీపీ నాయకుల ఉద్దేశం కూడా వేరేగా ఉంది. అర్హత లేని వారికి జిల్లాలలో పదవులు ఇచ్చారని కొన్నాళ్లుగా చెబుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపిక విషయంలో కూడా అర్హత లేని వారిని తీసుకున్నారనేది నాయకుల ఆరోపణ. దీనిని పైకి ఎవరూ చెప్పకపోయినా అంతర్గతంగా మాత్రం వైసిపి నాయకుల్లో ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు జిల్లాల సమీక్షలు చేపట్టాలన్న డిమాండ్ వెనక అర్హత లేని నాయకులను పక్కన పెట్టి తమకు అవకాశం ఇవ్వాలనేది నేతల డిమాండ్.
నిజానికి సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అనేక సామాజిక వర్గాలకు జగన్ అవకాశం కల్పించారు. అయితే వీరి వల్ల పార్టీ అభివృద్ధి చెందడం లేదనేది ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి, మార్పులు చేయాలని కోరుతున్నారు. కానీ, ఇలా చేయడం వల్ల అసలుకే సమస్య వస్తుందన్నది వైసీపీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆది నుంచి కూడా సామాజిక వర్గాలను నమ్ముకుని పార్టీ పదవులు టికెట్లు కూడా ఇచ్చారు.
ఇప్పుడు వారందరినీ పక్కన పెడితే వైసీపీకి సుస్థిరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకు కదిలిపోయే ప్రమాదం ఉందన్నది ఒక అంచనా. దీంతో జగన్ వ్యూహం, నాయకుల డిమాండ్లు బాగానే ఉన్నా జిల్లాల సమీక్షలో నాయకులను మార్చాలన్న నేతల డిమాండ్లను చేర్చడం అంతా ఈజీ కాదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చకూడా ఇదే. మరి దీన్ని ఏ విధంగా జగన్ పరిష్కరిస్తారు? నాయకులను ఏ విధంగా సంతృప్తి పరుస్తారు? అనేది చూడాలి.