ఐదేళ్ల జగన్ హయాంలో నవ్యాంధ్ర ఆర్థిక రంగంలో జరగని అవకతవకలు లేవు.. చేయని అక్రమాలు లేవు. చట్టాలను ఉల్లంఘించి మరీ అప్పుల ను దూసితెచ్చారు. ఆదాయం పెంచడం పూర్తిగా మానేసి కొత్తకొత్త మార్గాల్లో రుణాలు తెచ్చి ఆర్థిక రంగాన్ని పాతాళానికి తొక్కేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపు అన్ని శాఖల కార్యదర్శులూ మారారు. ఆర్థిక శాఖకు కూడా కొత్త సెక్రటరీలు వచ్చారు. కానీ జగన్ పాలనలో హయాంలో అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడిన కొందరు అధికారులను మాత్రం ఇంకా ఆర్థిక శాఖలో కొనసాగిస్తున్నారు.
గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడిన అధికారులే మొన్న శ్వేతపత్రం తయారీలో భాగస్వాములయ్యారు. పాపాలు బయటపడితే ఇరుక్కుంటామన్న భయం వారిలో ఉంటుంది. అలాంటప్పుడు వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి..? పెండింగ్ బిల్లులతో కలిపి రాష్ట్రం అప్పు రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. జగన్ హయాంలో ఏటా లక్ష కోట్లకు తగ్గకుండా అప్పులు తెచ్చారు. పెండింగ్ బిల్లులు దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటాయి. ఏపీఎస్డీసీ, బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీఆర్డీసీ, ఏపీఎస్ఎఫ్సీఎల్ల ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఖజానా ఆదాయాన్ని మళ్లించి మరీ అక్రమ మార్గంలో అప్పులు తెచ్చారు.
అలాగే, విద్యుత కార్పొరేషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఇంకా ఇతర కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి ప్రభుత్వ సొంత ఖర్చులకు వాడారు. అలాగే, ప్రభుత్వానికి పనులు చేసిన కాంట్రాక్టర్లను జగన్ సర్కార్ రాచిరంపాన పెట్టింది. ఫిఫో ఉల్లంఘించి మరీ.. అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లించారు. దీంతో లక్షల మంది కాంట్రాక్టర్లు తమకు బిల్లులు ఇప్పించాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు.
కోర్టు ఆదేశాలిచ్చినా అప్పటి ఆర్థిక శాఖ అధికారులు బిల్లులు చెల్లించకుండా కోర్టు ఆగ్రహానికి గురై.. దాని ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తెచ్చుకున్నారు. వారు కనీసం బిల్లు బాధితులను కలవడానికి కూడా ఇష్టపడలేదు. సచివాలయంలోని తమ కార్యాలయాలకు పోలీసుల కాపలా పెట్టుకుని మరీ బాధితులు తమ దరిదాపుల్లోకి రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆ పాత అధికారే (కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ) శ్వేతపత్రాన్ని రూపొందించడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అవకతవకలు సరిదద్దడం సవాలే..
జగన్ ప్రభుత్వ అవకతవకలను సరిచేయడం కూటమి ప్రభుత్వానికి సవాలే. ఎందుకంటే ఏడాదికి చెల్లించాల్సిన అప్పుల అసలు, వడ్డీలు కలిపి దాదాపు రూ.60 వేల కోట్లు. ఈ అగాధాన్ని పూడ్చాలంటే రాష్ట్ర ఆదాయం భారీగా పెరగాలి. పైగా యూనివర్సిటీలు, ఇంటర్ బోర్డు సహా ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ వద్దా రూపాయి కూడా లేదు. అన్నింటినీ జగన్ ప్రభుత్వం సమూలంగా ఊడ్చేసింది. వీటన్నింటినీ పూడ్చేందుకు కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.
పదవి పోయినా అవే అబద్ధాలు
ఇక ముఖ్యమంత్రి పదవికి దూరమైనా జగన్ అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అసత్యాలనే జనంలోకి తీసుకెళ్లారు. తన రోతపత్రిక సాక్షిలో, నీలిమీడియాలో, సోషల్ మీడియాలో ప్రతిపక్షంపై విషం చిమ్ముతూ, వైసీపీ పాలనకు జేజేలు కొడుతూ, ప్రభుత్వం ద్వారా అధికారికంగా ప్రకటనలు ఇచ్చి మరీ అవాస్తవాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. 2019లో ఆ మాయలో పడిన ప్రజలు 2024లో మాత్రం ట్రాప్‌లో పడలేదు.
వారు ఛీకొట్టినా ఆయన అవే అబద్ధాలు కొనసాగిస్తున్నారు. తాను గద్దె దిగేనాటికి అంటే జూన్ 4వ తేదీన రాష్ట్ర ఖజానాలో రూ.7,000 కోట్లు వదిలిపెట్టి వెళ్లానని.. అయినా సీఎం చంద్రబాబు కొత్త బడ్జెట్ పెట్టే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇది ఎంత పచ్చి అబద్ధమంటే.. జూన్ 4న రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోగా జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.4,200 కోట్ల అప్పు తీసుకున్నారు.
ఇందులో రూ.3,220 కోట్లు ఎస్డీఎఫ్, వేజ్ అండ్ మీన్స్ అప్పు కాగా రూ.1,000 కోట్లు ఓడీ అప్పు. ఆర్బీఐ నుంచి వాడుకున్న రూ.4,200 కోట్ల అప్పును జమ చేసి మళ్లీ అప్పులు తెచ్చి మిగతా జీతాలు, పెన్షన్లు, వైసీపీ కోసం, తన కోసం సుప్రీంకోర్టు దాకా వాదించిన లాయర్లకు బిల్లులు చెల్లించుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు మారే సమయంలో ఖజానాలో ఉన్న డబ్బు రాష్ట్రానికే ఉంటుంది. ఎవరూ సొంత జేబులో వేసుకుని వెళ్లరు. జగన్‌కైనా అదే రూల్. కానీ, తన సొంత బీరువాలో డబ్బేదో వదిలేసి వెళ్లినట్లు వ్యాఖ్యలు చేయడం విడ్డూరం.
2019లో బాబు దిగేనాటికి..
2019లో చంద్రబాబు గద్దె దిగేనాటికి ఖజానా అప్పుల్లో లేకపోగా రూ.100 కోట్ల డబ్బుతో ఉంది. ఇది వాస్తవం. రూ.100 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ తాము రూ.2.27 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని జగన్ గొప్పగా చెప్పుకొన్నారు. సమర్థ ఆర్థిక నిర్వహణకు బడ్జెట్ కొలమానం కాదు. ఖర్చులే కొలమానం. ఎక్కడ, ఎందుకు, దేనికోసం ఎంత ఖర్చు చేశామనేదే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇందులో జగన్ జీరో.
బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచే అదనపు నిధులంటూ వందల కొద్దీ ప్రతిపాదనలు గత ఐదేళ్లూ ఆర్థిక శాఖ వద్దకు క్యూ కట్టాయి. అలాంటప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టి ఏం లాభం? పనికిరాని, రాష్ట్రానికి తిరిగి పైసా ఆదాయం కూడా సమకూర్చలేని విభాగాల్లో మాత్రమే జగన్ గత ఐదేళ్లు ఖర్చులు చేశారు. ఆ అడ్డగోలు ఖర్చుల ఫలితమే రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.2.27 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టడం చాలా సులభం.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అన్ని మార్గాల్లో వచ్చిన ఆదాయం రూ.1.74 లక్షల కోట్లు. ఇంకో రూ.70,000 కోట్లు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అయినప్పటికీ గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనుడు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ.. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే తన మాతృశాఖ రైల్వేకు వెళ్లిపోవాలని చూశారు. ఈశాన్య రైల్వేలో జాయిన్ కావాలని జూన్ 13వ తేదీన రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై ఆయన జాయినింగ్ ఉత్తర్వులను రద్దుచేయించింది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ విరుద్ధ, అడ్డగోలు అప్పుల ఆలోచనలన్నీ సత్యనారాయణవే. వైజాగ్‌లో ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, పోర్టు భూములు తాకట్టు పెట్టడం నుంచి రాష్ట్ర సచివాలయం తాకట్టు వరకు ఈయన హస్తం ఉంది.
ఏపీసీఎఫ్ఎస్ఎస్ పేరుతో శాఖల వద్ద ఉన్న డబ్బులన్నింటినీ డిపాజిట్ల రూపంలో ఊడ్చేసిన మహా ఘనుడు. ఏపీఎస్డీసీ పేరుతో ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి బ్యాంకుల నుంచి రూ.25,000 కోట్ల అప్పు రాజ్యాంగ విరుద్ధంగా తేవడం, ఖజానాకు జమ కావాల్సిన మద్యం వ్యాట్ ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్ పేరుతో బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.22,500 కోట్ల అడ్డగోలు అప్పులు, ఏపీఎండీసీ వాటాలు అమ్మకానికి పెట్టి మార్కెట్ నుంచి రూ.7,000 కోట్లు అప్పులు తేవడం ఇలాంటి ఘోరమైన అప్పులకూ సత్యనారాయణే కారకుడు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యంత కీలకమైన నిధుల చెల్లింపును జగన్ ఈయన చేతిలోనే పెట్టారు. ఐదేళ్ల పాటు ఫిఫో ఉల్లంఘిస్తూ జగన్ అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లించిన సత్యనారాయణ.. ఎన్నికలు ఫలితాలు వచ్చాక, సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా జగన్ లాయర్లకు, అమరావతికి వ్యతిరేకంగా వాదించిన లాయర్లకు బిల్లులు చెల్లించారు. కేవలం పెండింగ్ బిల్లుల కోసమే హైకోర్టులో 4 లక్షల పిటిషన్లు పడ్డాయి. వీరెవరినీ ఖాతరు చేయకుండా కేవలం జగన్ అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తూ విపరీతమైన స్వామిభక్తిని ప్రదర్శించారు.
దేశంలోనే అత్యుత్తమ చెల్లింపుల వ్యవస్థగా అవార్డులు అందుకున్న సీఎఫ్ఎంఎస్ను సర్వనాశం చేసి, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను గందరగోళం చేశారు. రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసిన ఈ అధికారి డిప్యుటేషన్ జూన్ 18తో ముగిసింది. దీంతో గప్‌చుప్‌గా రాష్ట్రం నుంచి జారుకోవాలని చూశారు. కున్నాడు. అయితే ఈ ఐదేళ్లపాటు ఆర్థిక శాఖలో జరిగిన అన్ని అవకతవకల్లోనూ ఈ అధికారి భాగస్వామే. ఆర్థికరంగం గుట్టు బయటకు రావాలంటే ఈ అధికారి నోరువిప్పడం తప్పనిసరి.
అందుకే చంద్రబాబు పదవీప్రమాణం చేయగానే… ఏకపక్షంగా అక్రమంగా వ్యవహరించిన అధికారులను రిలీవ్ చేయకూడదని ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ సత్యనారాయణ తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిలీవింగ్ లేఖ ఇవ్వకుండానే ఈశాన్య రైల్వే ఉద్యోగంలో జాయినైపోయారు. అయితే ఆయనకు రిలీవింగ్ లేఖ ఇవ్వబోమని రైల్వే శాఖకు స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఆర్థిక శాఖలో సత్యనారాయణ ఉండడం అవసరమని పేర్కొన్నారు. రైల్వేశాఖతో సంప్రదింపులు జరిపి, మరో 6 నెలలపాటు సత్యనారాయణ రాష్ట్రంలోనే ఉండేలా అనుమతి తీసుకున్నారు. ఈ కాలంలో ఆయన అక్రమాలన్నీ విచారించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.