ప్రస్తుతం ఏపీ ఆర్థిక శాఖ చేసిన ఒక ప్రకటనపై సర్వత్రా విస్మయం, విమర్శలు వస్తున్నాయి. తమ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక భారం మోపిందని.. ఇది భరించడం కష్టమని.. ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోతుందని పేర్కొంది. మరి దీనికి కారణం ఏంటి? అని ఆలోచిస్తే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకోవచ్చని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో వివిధ వ్యాక్సిన్ కంపెనీలు.. తమ తమ వ్యాక్సిన్లకు సంబంధించి ధరలను ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. రాష్ట్రాలకు రూ.400 లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధపడగా.. కేంద్రానికి రూ.150 కే ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాయి. అయితే.. దీనిపై ఏపీ ఆర్థిక శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వంపై 1500 కోట్ల రూపాయల నుంచి రూ.2000 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆర్థిక శాఖ ఒక నోట్ వెలువరించింది. కానీ, దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజారోగ్యం కాపాడడానికి ఈ మాత్రం ఖర్చు చేయలేరా? అని నిలదీస్తున్నపరిస్థితి కనిపిస్తోంది.
అంతేకాదు.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులను వేసేందుకు దాదాపు 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. కోర్టులు తప్పిపట్టినా.. లెక్క చేయకుండా.. అదే పంథాను కొనసాగించారని.. అప్పులు ఆ డబ్బు భారమని అనిపించలేదా? అని నిలదీస్తున్నారు. ఇక, సుప్రీం కోర్టుకూడా తప్పు పట్టడంతో మళ్లీ ఆయా రంగులను మార్చేందుకు మరో 1300 కోట్లు ఖర్చు పెట్టారని అది కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా.. అదేవిధంగా సర్వే రాళ్లకు వేల కోట్లు ఖర్చుపెట్టినపుడు ప్రభుత్వంపై భారం పడుతుందని ఏపీ ఆర్థిక శాఖ అంచనా వేయలేదా? అని కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ప్రజారోగ్యం చూడాల్సి వచ్చినప్పుడు.. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడే.. ఆర్థిక పరిస్థితి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండడం గమనార్హం.