బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో కేటీఆర్-నాగార్జునల మధ్య జరిగిన సంభాషణ వల్లే నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున తీవ్రంగా స్పందించారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమన్న సురేఖ వ్యాఖ్యలను నాగార్జున తీవ్రంగా ఖండించారు.
రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను…ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని హితవు పలికారు. ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు సినిమా వాళ్లను వాడుకోవద్దని నాగార్జున అన్నారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని, బాధ్యత గల పదవిలో ఉన్న సురేఖ తమ కుటుంబం పట్ల చేసిన వ్యాఖ్యలు, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని నాగార్జున చెప్పారు. అంతేకాదు, తక్షణమే తన వ్యాఖ్యలను సురేఖ వెనక్కు తీసుకోవాలని నాగార్జున కోరారు.
ఇక, సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన ప్రకాష్ రాజ్…సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.