టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తో ఒకరైన కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలు ఉన్నాయంటూ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరు, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆచార్య. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే అప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల.. ఆచార్యతో ఫస్ట్ ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు.
ఈ సినిమా ఫలితం చిరంజీవి, కొరటాల మధ్య మనస్పర్థలకు కారణమైంది. ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటానికి కొరటాలే కారణమని ఛాన్స్ దొరికినప్పుడల్లా చిరంజీవి సాధిస్తూనే ఉన్నారు. ఇన్‌డైరెక్ట్‌గా కొరటాలపై సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. అయితే మొన్నీమధ్య దేవర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ.. `ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, పక్కనోళ్ళ పనిలో వేలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది` అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్ధేశించే కొరటాల చేశారని.. మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారంపై తాజాగా కొరటాల రియాక్ట్ అయ్యారు. దేవర ప్రమోషన్స్ లో బిజీగా బిజీగా గడుపుతున్న ఆయన.. చిరంజీవితో తనకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆచార్య ఫ్లాప్ అవ్వగానే చిరంజీవి గారి నుంచే తనకు ఫస్ట్ మెసేజ్ వచ్చిందని కొరటాల అన్నారు. `అంతా బానే జరుగుతుంది. నువ్వు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతావు` అంటూ మెసేజ్ చేసి చిరంజీవి గారు తనకు ధైర్యాన్ని, భరోసాను ఇచ్చారని కొరటాల శివ చెప్పుకొచ్చారు. బయట కొందరు అనవసరంగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తమ మధ్య మంచి బాండ్ ఉందని తెలిపారు.
కాగా, ఆచార్య వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ అనంతరం కొరటాల శివ డైరెక్ట్ చేసిన చిత్రం `దేవర`. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా యావత్ భారతీయ సినీ ప్రియులు దేవర పార్ట్ 1 కోసం ఎంతో అత్రంగా ఎదురుచూస్తున్నారు.