పార్టీపై, వైసీపీ అధినేత జగన్ పై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చాలాకాలంగా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు రెండోసారి మంత్రి పదవి దక్కక పోవడం, వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, తాను సూచించిన వారికి టికెట్లు కేటాయించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో జగన్, బాలినేనిల మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో, బాలినేని వైసీపీని వీడుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాలినేని వైసీపీకి గుడ్ బై చెబుతున్నానని సంచలన ప్రకటన చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ఘోర అవమానం పాలైన వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని….తన రాజీనామా లేఖను జగన్ కు పంపించారు. పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని చాలా సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తాజాగా నిన్న జగన్ బుజ్జగించినా బాలినేని వినలేదు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడారు. ఇక, జనసేన నేత నాగబాబును బాలినేని కలిశారని తెలుస్తోంది. నాగబాబుతో భేటీ తర్వాతే బాలినేని వైసీపీకి గుబ్ బై చెప్పారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో రేపు బాలినేని భేటీ కాబోతున్నారని, త్వరలోనే ఆయన జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది.