పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన సీట్లు వద్దని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోందని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాలేజీకి కేటాయించిన సీట్లు వద్దంటూ విద్యార్థుల భవిష్యత్తుతో టిడిపి చెలగాటమాడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం సీఎం జగన్ సొంత ఇలాకా కాబట్టే పులివెందుల మెడికల్ కాలేజీపై ఏపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు.
మాజీ సీఎం జగన్ పై సత్య కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 48 శాతం మంది బోధన సిబ్బంది లేరని, అటువంటి సందర్భంలో విద్యార్థులకు పాఠాలు జగన్ చెబుతారా అంటూ సత్య కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. ఇటువంటి అసమర్థ వ్యక్తి జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. నిర్మాణం పూర్తి కాకుండానే హడావిడిగా పబ్లిసిటీ కోసం కొన్ని మెడికల్ కాలేజీలను గత ఏడాది ప్రారంభించారని ఆయన ఆరోపించారు. దీంతో, రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతులు జరగడం లేదని, క్లాసులు లేవని అన్నారు. తరగతి గదులు లేవని, విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలని ఆయన నిలదీశారు.
ఒకవేళ తాత్కాలికంగా షెడ్లు నిర్మించినా…సిబ్బంది లేకుండా విద్యార్థులకు పాఠాలు ఎవరు చెప్తారని? జగన్ చెబుతారా అని ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటున్నది వైసీపీ నేతలని మండిపడ్డారు. ఇటువంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును జగన్ అర్థం చేసుకోవాలని, లేకుంటే బెంగళూరు ప్యాలెస్ వరకు తరిమికొడతారని సత్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పునాదులు వేసి నాలుగేళ్లు గడిచినా 17 వైద్య కళాశాలల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదని, సగానికి పైగా కాలేజీల నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయని అన్నారు. నిర్మాణం పూర్తి కాకుండానే గత ఏడాది రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీని ప్రారంభించారని, ప్రస్తుతం రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతి గదులు లేవని, తాత్కాలిక భవనాల్లో క్లాసులు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.