తమిళ నటుడు శింబు రియల్ హీరో అనిపించుకున్నాడు. భారీ వర్షాలు కారణంగా వరదలు ఏర్పడి తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రాలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, ఆ చుట్టుపక్కల గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వేలాది మంది ఇళ్లు నీట మునిగాయి. వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఎందరో టాలీవుడ్ స్టార్స్ ముందుకు వచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళాలు ప్రకటించారు.
కానీ ఇతర స్టేట్స్ నుంచి ఎటువంటి సాయం అందలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మన హీరోలు సాయం చేయడంలో ఎప్పుడు ముందే ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కోట్లకు కోట్లు కలెక్షన్స్ రాబట్టుకుని జేబులు నింపుకున్న ఇతర ఇండస్ట్రీ సెలబ్రెటీలు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డొనేట్ చేయలేదు. కనీసం తెలుగు రాష్ట్రాల పరిస్థితి పై స్పందించనూ లేదు.
ఇలాంటి టైమ్ లో తమిళ హీరో శింబు మొట్ట మొదటిగా తెలుగు స్టేట్స్ ను ఆదుకునేందుకు ముందడుగు వేశాడు. ఏపీ మరియు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు మూడు లక్షలు చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించాడు. బయట రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేసిన ఫస్ట్ సెలబ్రిటీగా నిలిచిన శింబు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. శింబును చూసైన ఇతర హీరోలు బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.