వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లపై కూడా మాజీ సీఎం జగన్ పగబట్టిన సంగతి తెలిసిందే. ఎంతోమందికి కడుపునిండా ఐదు రూపాయలకే అన్నం పెడుతున్న అమ్మ వంటి అన్నా క్యాంటీన్లను కూడా జగన్ టార్గెట్ చేయడం పై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ క్రమంలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 15 నాటికి ఏపీలో చాలా చోట్ల అన్న క్యాంటీన్లను పున ప్రారంభించారు. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 13 నాటికి ఏపీ వ్యాప్తంగా మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు.
జగన్ హయాంలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనమయ్యాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. జగన్ ఇంటికి పరిమితమయ్యారని, దీంతో, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని నారాయణ ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసిపి నేతలు… ప్రభుత్వ భూములను, పార్కులను ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, అలా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వైసీపీ నేతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ భూములను అప్పగించాలని సూచించారు. లేకుంటే తెలంగాణలో హైడ్రా మాదిరి ఏపీలో కూడా ప్రత్యేక వ్యవస్థ తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు. భూకబ్జాలకు పాల్పడ్డ అక్రమార్కుల భరతం పడతామని నారాయణ హెచ్చరించారు. ఇక, రుషికొండ భవనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారని, వాటి విషయంలో ఏం చేయాలన్న నిర్ణయం మిగతా మంత్రివర్గ సభ్యులతో కలిసి చర్చించి తీసుకుంటామని నారాయణ చెప్పారు. విశాఖలోని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా ఆధునీకరిస్తామన్నారు.