ఎంఐఎం ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నిర్వహిస్తున్న కాలేజీని కూల్చివేయొద్దని.. అవసరమని అనుకుంటే తనపై తుపాకీ గుళ్లు కురిపించాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత సీరియస్గా ఆయన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. హైడ్రా దూకుడుతో అనేక అక్రమా లకు చెక్ పెడుతున్నారు. ఆక్రమణలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరినీ ఉపేక్షించేది లేదని.. ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంతటి వారైనా ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని కూడా తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కేజీ టు పీజీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలు వెల్లువెత్తాయి. బండ్లగూడ చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ ఈ కాలేజీని నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏక్షణంలో అయినా.. ఈ కాలేజీ భవనాలను నేలమట్టం చేసే అవకాశంఉందని పెద్ద ఎత్తున దుమారం రేగింది. సాలార్-ఏ-మిల్లత్ ట్రస్టు ద్వారా ఈ విద్యాసంస్థలను ఒవైసీ బ్రదర్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముస్లిం మైనారిటీ విద్యార్థులకు చదువు చెప్పడంతోపాటు మైనారిటీ మహిళలకు చేతి వృత్తులు కూడా నేర్పించి.. ఆర్థికంగా వారు బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తున్న మాట వాస్తవమే.
పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించారు. అయితే.. ఇవి బండ్లగూడ చెరువును ఆక్రమించి నిర్మించార న్నది ప్రధాన ఆరోపణ. అయితే.. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పని అక్బరుద్దీన్ ఎదురు దాడికి దిగి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని.. తాను భయపడలేదని చెప్పారు. ఇప్పుడు కూడా తనపై గుళ్ల వర్షం కురిపించినా ఇష్టమేనని .. కానీ, కాలేజీని మాత్రం కూల్చవద్దని చెప్పారు. కానీ, ఇక్కడ అసలు విషయం.. సదరు స్కూల్ కమ్ కాలేజీని చెరువును ఆక్రమించి నిర్మించారా? లేదా? అన్న విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీనిని బట్టి.. సదరు కాలేజీని చెరువును ఆక్రమించి నిర్మించారనన ఆరోపణలకు బలం చేకూరుతోంది.
ఈ విషయాన్ని వదిలేసి.. తనపై తుపాకీ కాల్పులు జరపాలంటూ ఎదురు దాడి చేయడం అక్బరుద్దీన్ వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పేదలకు సేవ చేయడాన్నిఎవరూ తప్పుబట్టరు. కానీ.. సేవ ముసుగులో ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడతామంటే.. ఏ చట్టం కూడా హర్షించదు. మద్దతు ఇవ్వదు. దొంగతనం చేసైనా.. మక్కాకు.. లక్ష రూపాయల విరాళం ఇస్తానంటే బాగుటుందా? ఇదీ.. అలానే ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సేవ పేరు చెప్పి..అక్రమాలు కప్పిపచ్చుకునేందుకు ప్రయత్నిస్తే.. రేపు మరింత మంది ఇదే దారిలో నడుస్తారు. మరి అక్బరుద్దీన్ వైఖరిని ఆయనైనా ప్రశ్నించుకోవాలి. పార్టీలో కీలక నాయకులైనా సరిచేయాలి.