భారత దేశ రాజకీయ చరిత్రలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుస్పష్టమైన ప్రణాళిక, దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించిన అభివృద్ధికి పాతికేళ్ల క్రితమే బీజాలు వేసిన రాజకీయ దార్శనీకుడు చంద్రబాబు. తెలుగునాట ఐటీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.
ఐటీ రంగంలో చంద్రబాబు విశేష కృషికి నిలువెత్తు తార్కాణం హైటెక్ సిటీ. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉధ్యోగాలు, ఏటా వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈ రోజు సాధ్యమవుతున్నాయంటే ఆనాటి చంద్రబాబు కృషే కారణం. బెంగుళూరు,ముంభై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదారాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఐటీ ఉద్యోగులపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు ఏపీకి చెందిన వారేనని చంద్రబాబు అన్నారు. అదీ ఏపీ సత్తా..తెలుగోడి పవన్ అని అన్నారు.
తిరుపతి శ్రీ సిటీలో ఈ రోజు పర్యటించిన చంద్రబాబు…వివిధ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలు సంపద సృష్టిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని, ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయమని, అపూర్వ ఘట్టమని కొనియాడారు. భారత్ ను ఐటీ రంగం ప్రపంచపటంలో నిలుపుతుందని 1991లో చెప్పానని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఐటీ రంగంలో భారతీయులు కనిపిస్తారని, ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులేనని, అందులో ఒకరు తెలుగువారని గర్వపడ్డారు.
దేశంలో హైదరాబాదులో ఐటీ రంగానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్నాయని చంద్రబాబు చెప్పారు. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మించామన్నారు. శ్రీ సిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని, ఇక్కడ సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటయ్యాయని వివరించారు.
శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా అభివృద్ధి చేస్తానని చెప్పారు. 2029 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, విజన్-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. 2047 నాటికి భారత్ నెంబర్ వన్, లేదా నెంబర్ టూ స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు. శ్రీ సిటీలో చంద్రబాబు ఒకే రోజు 15 పరిశ్రమలను ప్రారంభించారు. 7 సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. శ్రీ సిటీలో రూ.900కోట్ల పెట్టుబడితో 2,74 0మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.