దిగ్గజ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. తొలి సినిమా నుంచే తనదైన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులను అలరించారు. విక్టరీనే ఇంటి పేరు మార్చుకుని స్టార్ హీరోగా చక్రం తిప్పారు. నేటితో వెంకటేష్ ఫిల్మ్ జర్నీకి 38 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆయన హీరోగా నటించిన డెబ్యూ మూవీ `కలియుగ పాండవులు` 38 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలై హిట్ గా నిలిచింది.
అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ వెంకటేష్ హీరో అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. వ్యాపార రంగంలో సత్తా చాటాలని టీనేజ్ నుంచే వెంకీ ఆశపడ్డారు. అందులో భాగంగానే అమెరికాలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. కానీ అనూహ్యంగా ఆయన సినిమా రంగం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. 1986 ఆగస్టు 14 న విడుదలైన సూపర్ హిట్ చిత్రం కలియుగ పాండవులును మొదట సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని దర్శకనిర్మాతలు కె.రాఘవేంద్రరావు మరియు దగ్గుబాటి రామానాయుడు భావించారు.
రాఘవేంద్రరావు కృష్ణ గారికి కథ వినిపించారట. అయితే కృష్ణ తన బంధువు ఏ.ఎస్.ఆర్ ఆంజనేయులు కు ఓ చిత్రం చేసి పెడతానని మాట ఇచ్చి ఉన్నారు. దాంతో అతన్ని సహా నిర్మాతగా పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని కృష్ణ చెప్పారట. అందుకు రామానాయుడు ఒప్పుకోకపోవడంతో.. కృష్ణ సున్నితంగా కలియుగ పాండవులు మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత చాలా మంది హీరోలను పరిశీలించారు.
సరిగ్గా అదే సమయంలో ఓ స్నేహితుడు.. `మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ఊరంతా ఎందుకు వెతుకుతున్నారు` అంటూ వెంకీని ఉద్ధేశించి రామానాయుడుతో అన్నాడట. అంతే రామానాయుడు వెంటనే కొడుకును అమెరికా నుంచి ఇండియాకు రప్పించారు. సినిమా గురించి చెప్పి హీరోగా చేయాలని అడిగారట. తండ్రి కోరడంతో కాదనలేకపోయిన వెంకీ.. 1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాలో ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు సాధించారు. ఆ తర్వాత తనదైన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ విక్టరీ వెంకటేష్ గా ప్రసిద్ధి చెందారు.