తమిళ నటుడు విశాల్ కు కోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన వ్యవహారశైలిని తప్పు పట్టటమే కాదు.. న్యాయమూర్తి ఆయనపై సీరియస్ అయ్యారు. ఇదేమీ షూటింగ్ కాదన్న న్యాయమూర్తి.. కాస్త జాగ్రత్తగా సమాధానం ఇవ్వండంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఇంతకూ కోర్టులో ఏం జరిగింది? హీరో విశాల్ ఇలాంటి చేదు అనుభవం ఎందుకు ఎదురైందన్న విషయానికి వస్తే..
పందెం కోడి 2 చిత్ర సమయంలో ఆ మూవీ నిర్మాత అయిన లైకా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అయితే.. ఈ అంశంపై వివాదం నెలకొంది. హీరో విశాల్ తమకు ఇంకా డబ్బులు ఇవ్వాలని పేర్కొంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా… న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విచారణకు గురువారం హాజరయ్యారు విశాల్. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వని విశాల్ తీరుపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. లైకా సంస్థతో చేసుకున్న పత్రంపై సంతకాప్ని చేశారా? అని జడ్జి ప్రశ్నించిగా.. ఒక ఖాళీ కాగితం మీద సంతకం చయించుకున్నట్లుగా విశాల్ తెలిపారు.
ఈ వ్యాఖ్యపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. ఖాళీ పేపర్ సంతకం ఎందుకు చేయాలి? అంటూ ప్రశ్నించారు. ‘‘తెలివిగా సమాధానం చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇదేమీ సినిమా షూటింగ్ కాదు. కాస్త జాగ్రత్తగా బదులివ్వండి’’ అంటూ పేర్కొన్న వ్యాఖ్యపై స్పందించిన విశాల్.. తాను లైకా దగ్గర అప్పు తీసుకున్న విషయాన్ని అంగీకరించారు.
పందెం కోడి 2 రిలీజ్ కు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చారా? అంటూ విశాల్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపలేదు.
ఈ మౌనంపైనా జడ్జి సీరియస్ అయ్యారు. ఇలా చేయకూడదు. మీరు అవునో.. కాదో బదులివ్వాలి’’ అంటూ పేర్కొన్నారు. దీంతో.. స్పందించిన విశాల్.. లైకా సంస్థ వద్ద తాను డబ్బులు తీసుకున్నట్లుగా అంగీకరించారు. మొత్తంగా చూస్తే.. కోర్టులో విశాల్ కు ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.