కొత్త సినిమా విడుదలైనంతనే పైరసీ రాయుళ్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక.. క్రేజీ సినిమా విడుదలైన గంటల్లోనే దాని పైరసీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు భారీగా ప్లాన్ చేస్తుంటారు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా వెన్ను విరిచేలా మారిన ఈ పైరసీ భూతానికి సహకరించే వారెందరో. అలాంటి వారిని పట్టుకోవటానికి ప్రయత్నించినా చాలా సందర్భాల్లో దొరకని పరిస్థితి.
తాజాగా ధనుష్ నటించిన ‘రాయన్’ మూవీ విడుదల కావటం తెలిసిందే. ధనుష్ కెరీర్ లో 50 మూవీ కావటంతో దీన్ని అత్యంత భారీగా నిర్మించారు. ఈ మూవీని పైరసీ చేసేందుకు వీలుగా రికార్డు చేస్తున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెట్టింట తమిళ రాకర్స్ గా సుపరిచితమైన వెబ్ సైట్ ఆడ్మిన్ ను కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని థియేటర్ లో రాయన్ మూవీని సెల్ ఫోన్ లో రికార్డు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏదైనా క్రేజీ మూవీ రిలీజ్ అయితే చాలు.. తమిళ్ రాకర్స్ పైరసి గ్రూప్ యాక్టివ్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. వెబ్ సైట్ తో మాత్రమే కాదు.. టెలిగ్రామ్ ద్వారా కూడా తమ పైరసీ చిత్రాల్ని విడుదల చేస్తుంటారు. ఇప్పటికే వీరి బారిన పలు చిత్రాలు పడ్డాయి. గత నెలలో కేరళ నటుడు ప్రథ్వీరాజ్ నటించిన ‘గురువాయూర్ అంబలనడైయిల్’ మూవీ విడుదల కాగా.. ఈ సినిమా విడుదలైన రోజునే తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో దీన్ని పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో సదరు నటుడి సతీమణి సుప్రియ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన కొచ్చి పోలీసులు.. ఈ తమిళ్ రాకర్స్ పైరసి గ్రూప్ ను పట్టుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం థియేటర్ లో రాయన్ మూవీని సెల్ ఫోన్ లో రికార్డు చేస్తున్న వేళ.. పోలీసులు అదుపులోకి తీసుకొని ఐదు రోజులు రిమాండ్ కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జెఫ్ స్టీఫన్ రాజ్ తమిళ్ రాకర్స్ గ్రూప్ ఆడ్మిన్ గా గుర్తించారు.