అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకు మాజీ సీఎం జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. శాసనసభలో కూర్చునే దమ్ము లేక జగన్ ఢిల్లీలో ధర్నాలంటూ తిరుగుతున్నారని టీడీపీ సహా జనసేన, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించిన జగన్ అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవుల్లోకి వెళితే ఏంటి అంటార్కిటికా మంచులోకి వెళ్తే ఏంటి అని జగన్ పై షర్మిల వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల ఎద్దేవా చేశారు. అంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా ఉండవని ఫైర్ అయ్యారు. గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజలను వింతగా మోసం చేయడం, అవమానించడం జగన్ కే చెల్లిందని దుయ్యబట్టారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం, దివాలాకోరుతనానికి నిదర్శనమని షర్మిల దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ అఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ అఫ్ మీడియా అసెంబ్లీ కాదని చురకలంటించారు.
చట్టసభల్లో ప్రజల గొంతు వినిపించేందుకే ఎమ్మెల్యేగా గెలిచారని, మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికి కాదని జగన్ ను షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ఇంకేం లేదని అధికార పక్షం శ్వేత పత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని కూర్చుని ప్రెస్ మీట్ టు పెట్టి ప్రజలు గెలిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చురకలంటించారు. అసెంబ్లీకి పోనీ జగన్ ప్రతిపక్ష హోదాకే కాదని, ఎమ్మెల్యే హోదాకు కూడా అనర్హులని షర్మిల చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. అంతేకాదు, ఆ క్రమంలోనే జగన్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది.