అలనాటి తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీపైనే పెట్టింది. ఇక్కడ వరుసగా సినిమాలను టేకప్ చేస్తూ యమా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో రెండు తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో దేవర ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.
చిత్రీకరణ దశలో ఉన్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో జాన్వీ పాల్గొనగా.. ఆమెకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ లలో మీరు ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారు..? అని యాంకర్ ప్రశ్నించింది.
అందుకు జాన్వీ బదులిస్తూ.. నాకు ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం ఇష్టమని తెలిపింది. అసలు ఆప్షన్స్ లో ఎన్టీఆర్ పేరే లేదు. కానీ జాన్వీ మాత్రం `ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్‌తో ఓ సాంగ్ చేశా. మరో సాంగ్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా` అని చెప్పి బాలీవుడ్ హీరోలైన విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ లకు బిగ్ షాక్ ఇచ్చింది.
అంతేకాదు ఎన్టీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. `ఎన్టీఆర్ సూపర్ ఎనర్జిటిక్ హీరో.. ఆయన రాగానే సెట్‌కే కళ వస్తుంది. అందరూ ఉత్సాహంగా మారిపోతారు. రీసెంట్ షెడ్యూల్ లో మా ఇద్దరిపై ఒక సాంగ్ ను చిత్రీకరించారు. ఆయన డాన్స్ వేగాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎన్టీఆర్ ఒక్క సెకనులో దేన్నైనా నేర్చుకోగలరు. అదే విషయం నేర్చుకోవడానికి నాకు పది రోజులు పడుతుంది` అంటూ జాన్వీ కపూర్ కామెంట్స్ చేసింది.