ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావటం కామనే. అందునా రాజకీయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పదేళ్లు అంతులేని అధికారాన్ని అనుభవించిన తర్వాత.. అడ్రస్ లేని రీతిలో ఓటమి ఎదురుకావటం ఒక ఎత్తు అయితే.. దానికి బదులు మరింత కష్టంతో కోల్పోయిన ఆదరణను తిరిగి సాధించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకు భిన్నంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ.. ఎప్పుడో ఒకసారి పార్టీ నేతల్నిఫామ్ హౌస్ లో భేటీ అవుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్
అలాంటి ఆయన కేంద్ర బడ్జెట్ వేళ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అనూహ్యంగా ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హజరు కావటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల కారణంగా జరిగిన డ్యామేజ్ ఒక ఎత్తు అయితే.. తాజా భేటీ వేళ.. ఐదుగురు ఎమ్మెల్యేలు రాకపోవటం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. సమావేశానికి డుమ్మా కొట్టిన ఐదుగురులో ముగ్గురు హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేలుకావటం మరో ఆసక్తికర అంశంగా చెబుతున్నారు.
గులాబీ బాస్ నిర్వహించిన సభకు హాజరుకాని ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి.. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా డుమ్మా కొట్టిన వారిలో ఉన్నారు.
బడ్జెట్ సమావేశాలు ముగిసే నాటికి పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. రాకపోవటం కొత్త చర్చకు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఏదైనా వ్యక్తిగత కారణాలతో ముందస్తుగా తాము రాలేకపోవటానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి ఉంటే.. ఆ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా మరింత డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని గులాబీ బాస్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?