పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మోస్తరు ఓటమిని చవిచూసిన గులాబీ పార్టీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ వైపు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తగతమయ్యే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.
ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని ప్రకాష్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ తో పాటు ఆయన అనుచరులు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
తాజాగా ప్రకాష్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ప్రకాష్ గౌడ్ కంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కాలే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.