సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్. గత కొన్నేళ్ల నుంచి వెంకటేష్ సోలోగా కన్నా మల్టీస్టారర్ సినిమాలనే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు తన రాబోయే సినిమాలో కూడా మరో స్టార్ హీరోతో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని బలంగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మరోసారి పనిచేసేందుకు వెంకటేష్ సిద్ధం అయ్యాడు. వీరి హ్యాట్రిక్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. జూలై 3న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. యాక్షన్ ఎంటర్టైలర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఫన్ అండ్ యాక్షన్ మేళవింపుతో ఆయన పాత్రను డిజైన్ చేశారు. ఇకపోతే మూవీ సెకండాఫ్ లో ఓ అరగంట పాటు వచ్చే ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందట. ఆ పాత్ర ఎంట్రీతో కథ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందట. అయితే ఆ పాత్రకు బాలయ్య పర్ఫెక్ట్గా సెట్ అవుతారని అనిల్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిపారట.
ప్రస్తుతం ఆయన నుంచి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారని ఇన్సైడ్ బలంగా టాక్ నడుస్తోంది. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడితో బాలకృష్ణకు మంచి ర్యాపో ఉంది. పైగా డేట్స్ తక్కువే కాబట్టి అనిల్-వెంకీ హ్యాట్రిక్ మూవీకి బాలయ్య ఎస్ చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇటు దగ్గుబాటి అభిమానులు, అటు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు.