ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అటు సార్వత్రిక సమరంలోనూ పోటీ చేసే అవకాశం రాలేదు.. దీంతో ఆ సీనియర్ నాయకుడు సైలెంట్ అయిపోయారు. పార్టీకి అంటిముట్టనట్లుగా ఉన్నారు. పార్టీ ప్రచారంలోనూ పెద్దగా కనిపించలేదు. ప్రధాని మోడీ వచ్చినా ఆయన కదల్లేదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న ఆ నేత ఇప్పుడు నోరు విప్పారు. ఆయనే.. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అలియాస్ వైఎస్ వీర్రాజు. జగన్ ఓటమితో తీవ్రంగా దిగులు చెందాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. మొత్తానికి వాటినుంచి తేరుకున్నాడా అన్నట్లు చాలా కాలం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడం ఆశ్చర్యం కలిగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ ఏపీ అధ్యక్షుడి పదవి పోయినప్పటి నుంచే వీర్రాజు నెమ్మదించారనే టాక్ ఉంది. ముఖ్యంగా టీడీపీతో బీజేపీ పొత్తును ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ పార్టీ అధిష్ఠానం టీడీపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందనుకుంటే అది కూడా దక్కలేదు. దీంతో వీర్రాజు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రచారంలో కూడా కనిపించలేదు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే విషయాలు కూడా బయటకు రాలేదు.
దీంతో రాజకీయాలకు వీర్రాజు దూరమయ్యారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఇప్పుడు ఆయన హఠాత్తుగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఏపీలో తాజా రాజకీయాల గురించి, నేతలు పార్టీ మారే విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బీజేపీలో చేరే ప్రతిపాదన లేనే లేదన్నారు. అయితే పుంగనూరులో మున్సిపల్ ఛైర్మన్ టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఇతర పార్టీలోకి చేరకూడదనే నిబంధన ఏదీ లేదని వీర్రాజు అన్నారు. ఈవీఎంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కానీ ఇన్ని రోజుల తర్వాత వీర్రాజు మౌనం వీడటంతో తాను ఇంకా రాజకీయాల్లో ఉన్నాననే చాటాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.