తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో నాగ్ అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ చేసింది ఇప్పటివరకు రెండే సినిమాలు. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం ఒకటి కాగా.. మరొకటి మహానటి. ఈ రెండు సినిమాలు విజయవంతం అయ్యాయి. ముఖ్యంగా మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ పేరు జాతీయస్థాయిలో మారుమోగింది. ఇప్పుడు `కల్కి 2898 ఏడి` మూవీ తో ఇంటర్నేషనల్ వైడ్ గా తన మార్క్ చూపించేందుకు నాగ్ అశ్విన్ రెడీ అవుతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీనే కల్కి 2898 ఏడీ. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటాని వంటి ఎందరో స్టార్స్ ఈ సినిమాలో భాగం అయ్యారు. కల్కి మూవీలో గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. గ్లోబల్ రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం జూన్ 27వ తేదీన అట్టహాసంగా విడుదల కాబోతోంది. ప్రీ సేల్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
విడుదలకు ముందే కల్కి రికార్డుల దిశగా పయనం అవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డైరెక్టర్ నాగ అశ్విన్ గురించి ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కెరీర్ ఆరంభం నుంచి నాగ్ అశ్విన్ కు ఒక హీరోయిన్ సెంటిమెంట్ గా మారిందనే వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఆ హీరోయిన్ లేకుండా ఇప్పటివరకు నాగి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో ఆమెనే హీరోయిన్గా నటించింది.
ఆ తర్వాత మహానటి చిత్రంలో మాళవిక నాయర్ కు ఒక పాత్రను కేటాయించారు. ఇక ఇప్పుడు కల్కి సినిమాలో కూడా మాళవిక నాయర్ నటించిందన్న విషయం ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. మహాభారతంలో చాలా ముఖ్యమైన ఉత్తర పాత్రను నాగ్ అశ్విన్ కల్కి చిత్రంలో మాళవికకు ఇచ్చారు. దీంతో మాళవిక ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ను నాగ్ అశ్విన్ నమ్ముతున్నాడని.. అందుకే ఆమెకు తన ప్రతి సినిమాలోనూ స్పెషల్ గా ఒక పాత్ర ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.