ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ తన సంస్థాగత లోపాలు వెతుక్కోవడం మానేసి.. ఈవీఎంలపై పడిందా? తాజా మాజీ సీఎం జగన్ .. ఈవీఎంలను తప్పుబడుతున్నారా? ఈవీఎంలతో మేలు జరగడం లేదని భావిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈవీఎం లు వద్దు .. బ్యాలెట్ పేపర్ ముద్దు అని వ్యాఖ్యానించారు.
మన దేశంలో కూడా.. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్‌ను ప్రవేశ పెట్టాలని మాజీ సీఎం జగన్ కోరారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగాను, దేశంలోనూ ఈవీఎంలపై చర్చ సాగుతోంది. ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేగుతున్న సమయంలో మహారాష్ట్రలోని ఓ పత్రిక.. ఈవీఎలను ట్యాంపరింగ్ చేయొచ్చని.. ఫలితాన్ని తారు మారు చేసేందుకు అవకాశం ఉందని కథనాలు రాసుకొచ్చింది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి.
మరోవైపు.. టెస్లా అధినేత, కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా.. ఈవీఎంలతో ఏదైనా చేయొచ్చని వ్యాఖ్యానిం చారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం స్పందిస్తూ.. “న్యాయం అందడం మాత్రమే కాదు… అందజేయబడి నట్లు కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా బలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా… దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలోని ఎన్నికలు. పేపర్ బ్యాలెట్ల ద్వారానే జరుగుతాయి. EVMల ద్వారా కాదు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి“ అని ట్వీట్ చేశారు.
విమర్శలు ఇవీ..
అయితే.. జగన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఇప్పుడు 11 స్థానాలు రావడంతో ఈవీఎంలపై తప్పులు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ..ఆయనను ప్రశ్నించారు. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చిన రోజు కూడా ఇలాగే అని ఉంటే ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలకు విలువ ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, దీనిపై టీడీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.