టాలీవుడ్లో మోస్ట్ రెస్పెక్టబుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకడు. రాజమౌళి తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు ఆయనే అంటే అతిశయోక్తి కాదు. జక్కన్నలా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా ఎపిక్ మూవీస్ తీయకపోయినా.. సుకుమార్‌కు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. కథల్లో, టేకింగ్‌లో ఆయన చూపించే వైవిధ్యమే అందుక్కారణం. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సుకుమార్ తీసిన ‘పుష్ప’ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. ఆయన గౌరవమేమీ తగ్గిపోలేదు.
నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల ‘పుష్ప’ అంతిమంగా హిట్ స్టేటస్ అందుకుంది. దాని వల్ల ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. ఐతే ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ వ్యవహరిస్తున్న తీరే తీవ్ర వివాదాస్పదమవుతోంది. సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకుంటాడు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. దేనికీ ఫిక్స్ కాకుండా మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. సెట్స్‌లోకి వచ్చి కూడా సీన్, డైలాగులు మారుస్తాడని ఆయనతో పని చేసిన వాళ్లు పాజిటివ్ యాంగిల్లోనే చెబుతుంటారు.
కానీ ‘పుష్ప-2’ విషయానికి వచ్చేసరికి సుకుమార్ పర్ఫెక్షన్ కాస్తా చాదస్తం, లెక్కలేనితనంగా మారి నిర్మాతల కొంప ముంచేస్తోందన్నది యూనిట్ వర్గాల సమాచారం. రిలీజ్‌కు అనుకున్న దాని కంటే ఎక్కువ టైం ఇచ్చినా సుకుమార్ విపరీతంగా షూటింగ్ డేస్ వేస్ట్ చేసి ఇప్పుడు చెప్పిన ప్రకారం సినిమాను రిలీజ్ చేయలేని స్థితికి తీసుకొచ్చాడన్నది ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణ. ‘పుష్ప-2’ వర్కింగ్ డేస్ ఇప్పటికే 300 రోజులు దాటిపోయాయట.
బాహుబలి లాంటి ఎపిక్ మూవీస్‌కి ఇంత టైం పెట్టారంటే ఒక అర్థముంది. కానీ ‘పుష్ప-2’ లాంటి సినిమా కోసం ఇన్ని రోజులు ఖర్చు చేసి కూడా షూట్ పూర్తి చేయకపోవడం అంటే కచ్చితంగా అది దర్శకుడి వైఫల్యమే. ఏం చేసినా సర్దుకుపోయే నిర్మాతలు ఉన్నారు కదా అని మరీ ఇంత ఉదాసీనంగా ఉండడం ఏంటి అనే చర్చ ‘పుష్ప-2’ యూనిట్లోనే కాదు.. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. సినిమాను వాయిదా వేయాలనుకున్నాక కూడా సుకుమార్ షూటింగ్ సరిగ్గా చేయకుండా కాల్ షీట్స్, డబ్బులు బాగా వేస్ట్ చేయిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతుండడం ఆయన మీద ఇండస్ట్రీలో బాగా నెగెటివిటీ పెరగడానికి కారణమవుతోంది.