నారా భువనేశ్వరి…ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిగా అందరికీ సుపరిచితురాలు. హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడుపుతున్న సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రున్యూర్ ఆమె. తన తండ్రి మాజీ సీఎం అయినా, తన భర్త సీఎం అయినా, సోదరుడు బాలయ్యా స్టార్ హీరో, ఎమ్మెల్యే అయినా ఏనాడూ రాజకీయాల జోలికి రాలేదు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా, హెరిటేజ్ ద్వారా సేవా కార్యక్రమాల్లో అడపాదడపా కనిపించడమే తప్ప మీడియాలో కూడా పెద్దగా ఆమె కనపడరు. అటువంటి భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చింది. తన భర్త చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకి వచ్చారు.
ఏపీలో జరుగుతున్న అరాచక పాలన అంతం కావాలని టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి కంటతడిపెట్టారు. అయితే, ఆ కష్టకాలం అయిపోయి…ఇపుడు నారా, నందమూరి కుటుంబాలతో పాటు ఏపీకి కూడా మంచిరోజులు వచ్చాయి. అందుకే, నారా, నందమూరి కుటుంబాలతోపాటు ఏపీ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే తన బావ కళ్లల్లో ఆనందం చూసిన నందమూరి బాలకృష్ణ…సంతోషంతో తన సోదరి భువనేశ్వరి నుదిటిపై ముద్దు పెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. భువనేశ్వరి భుజం తట్టి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు.
ఈ భావోద్వేగభరిత దృశ్యం చూసిన అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ తన సోదరి నుదుటిన ముద్దు పెట్టే ఎమోషనల్ సీన్ తో బాలయ్య, భువనేశ్వరిల సన్నివేశాన్ని పోలుస్తున్నారు నెటిజన్లు. ఐదేళ్ల పాటు తన సోదరి, బావ అష్టకష్టాలు పడ్డారని, ఈ రోజు అవన్నీ తీరిపోయాయన్న ఆనందంలో బాలయ్య అలా చేసిన వైనం గుండెలకు హత్తుకుందని అంటున్నారు. అన్నాచెల్లెలి అనుంబంధం..ఇది జన్మజన్మలా సంబంధం…బాలయ్యా నువ్వు సూపర్…అంటూ ఫీల్ గుడ్ వీడియోను వైరల్ చేస్తున్నారు.