ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు బండ్ల గణేష్, పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ జనసేన తరఫున పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారని వెల్లడించారు. అయితే, ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి.. కానీ, అప్పటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని తెలిపారు. జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. రెండో రోజుల క్రితం మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్.. హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారని.. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో.. యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని.. అవసరం అయినప్పుడు ఆక్సిజన్ కూడా పెడుతున్నారని తెలిపారు.
చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కల్యాణ్‌ను పరీక్షించిందని, జ్వరం, ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారని వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారని వెల్లడించారు.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న దిల్ రాజు, బండ్ల గణేష్ కరోనాబారిన పడడం, పవన్ హోం ఐసోలేషన్ లో ఉండడం వంటి కారణాల నేపథ్యంలో పవన్ కూడా కరోనా బారినపడ్డారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డారని, దీంతో, పవన్ కు కూడా కరోనా పాజిటివ్ అన్న వదంతులు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ఊపిరితిత్తులతో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఏర్పడిందని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వ్యవహారంపై పవన్ తరఫు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఇదంతా ఫేక్ న్యూస్ అని అంతా అనుకున్నారు. అయితే, ఆ ప్రచారానికి తెరదించుతూ తాజాగా పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ అని జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రెస్ నోట్ తో పవన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. పవన్ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.