ఓట్ల లెక్కింపు మొదలై గంట గడిచింది. మొదటి గంటలోని అరగంట పోస్టల్ బ్యాలెట్లను ఓపెన్ చేసి లెక్కిస్తే.. ఎనిమిదిన్నర నుంచి ఈవీఎంల లెక్కింపు షురూ అవుతుంది. సాధారణంగా ఎన్నికలు ఏవైనా ఆరంభంలో ఎవరు అధిక్యతను ప్రదర్శిస్తారో.. వారే తర్వాత కంటిన్యూ అవుతారన్నట్లుగా చెబుతారు.
ఏపీ విషయానికి వస్తే.. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి గంటకు ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తన అధిక్య ఖాతాను తెరవకపోవటం ఆసక్తికరంగా మారింది. పలు టీవీ చానళ్లలోనూ.. వెబ్ సైట్లలోనూ లైవ్ లింకుల్ని చూస్తున్న వేళ.. ఈ అంశం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
తొలి గంట తర్వాత అంటే ఉదయం 9 గంటల వేళకు.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ కూటమి 38స్థానాల్లో అధిక్యతలో నిలిచింది. ఇందులో టీడీపీ 32 స్థానాల్లో జనసేన 5 స్థానాల్లో బీజేపీ ఒక స్థానంలో అధిక్యతలో నిలవగా.. లోక్ సభ స్థానాల విషయానికి వస్తే.. టీడీపీ కూటమి 7 స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తోంది.
ఇందులో టీడీపీ 5 స్థానాల్లో.. బీజేపీ 2 స్థానాల్లో అధిక్యతలో నిలిచింది. మొత్తంగా అటు అసెంబ్లీ స్థానాల్లోనూ.. ఇటు ఎంపీ స్థానాల్లోనూ తొలి గంటలో ఏపీ అధికార పక్షం తన ఖాతాను ఓపెన్ చేయకపోవటం గమనార్హం. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తన హవా చూపుతోంది. బీజేపీ 5 స్థానాల్లో అధిక్యంలో ఉంటే.. కాంగ్రెస్ 2 స్థానాల్లో.. మజ్లిస్ ఒక స్థానంలో అధిక్యంలో ఉంది. ఇక.. జాతీయ స్థాయిలో ఎంపీ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. ఎన్డీయే 258 స్థానాల్లో.. ఇండియా కూటమి 105 స్థానాల్లో అధిక్యతను కనబరుస్తోంది. ఇతరులు రెండు స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.