ఎగ్జిట్ పోల్స్..ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయని అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఫలితాలలో దూసుకుపోతోంది. మొదటి గంట కౌంటింగ్ తర్వాత ఉన్న ఫలితాల ప్రకారం 543 లోక్ సభ స్థానాలకు గాను 272 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ లో ఎన్డీఏ లీడ్ లో ఉంది. ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 199 స్థానాల్లో లీడ్ లోఉంది.
అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లుగానే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ లో 175 నియోజకవర్గాలకు గాను 100 నియోజకవర్గాలలో టీడీపీ లీడ్ లో ఉండగా, 35 స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉంది. ఏపీ ఫలితాలను తారుమారు చేసే సత్తా ఉన్న పోస్టల్ బ్యాలెట్ లలో టీడీపీ కూటమి మెజారిటీలో ఉంది. ఈవీఎంల లెక్కింపు తొలి గంట పూర్తయిన నేపథ్యంలో 47 స్థానాల్లో టీడీపీ, 7 స్థానాల్లో జనసేన, 2 స్థానాల్లో బీజేపీ..వెరసి ఎన్డీఏ కూటమి 56 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఏపీలో లోక్ సభ ఫలితాలలో టీడీపీ 6 లోక్ సభ స్థానాల్లో ముందంజలో ఉండగా బీజేపీ 2 స్థానాల్లో లీడ్ లో ఉంది. వైసీపీ 10 అసెంబ్లీ స్థానాలతోపాటు 2 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.
కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రౌండ్ లో 1549 ఓట్ల లీడ్ లో ఉన్నారు. పులివెందుల నుంచి సీఎం జగన్ తొలి రౌండ్ లో 1888 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉన్నారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, గజపతి నగరం నుంచి టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్, పూతలపట్టు నుంచి టీడీపీ అభ్యర్థి మురళీ మోహన్, గంగాధర నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థి థామస్ లీడ్ లో ఉన్నారు.
లోక్ సభ స్థానాల్లో కూడా టిడిపి 6 స్థానాల్లో లీడ్ లో ఉంది. నెల్లూరు వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాణ్యం టీడీపీ లోక్ సభ అభ్యర్థి బైరెడ్డి శబరి, నరసరావుపేట లోక్ సభ టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజమండ్రి లోక్ సభ బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్ లో ఉన్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్ లో ఉండగా బిజెపి 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం ఒక స్థానంలో లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవాల్సి ఉంది.