మాచర్ల నియోజకవర్గం…గత ఏడాది టాలీవుడ్ హీరో నితిన్ నటించిన సినిమా టైటిల్ ఇది. టైటిల్ చూసి చాలా పవర్ ఫుల్ గా ఉందని అనుకున్న నితిన్ అభిమానులకు ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఇక, తాజాగా ముగిసిన ఏపీ ఎన్నికల సందర్భంగా ఆ పేరు మార్మోగిపోతూ వైసీపీ అభిమానులకు నిరాశ మిగల్చబోతోంది. ఎందుకంటే, తీవ్ర వ్యతిరేకత వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి మాచర్ల నియోజకవర్గంలో ఓటమిపాలు కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆ ఆక్రోశం పట్టలేకే ఈవీఎం ధ్వంసంతోపాటు మాచర్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నారు. అయినా సరే పిన్నెల్లికి హైకోర్టు ఊరటనివ్వడం, అరెస్ట్ చేయవద్దని ఆదేశించడం చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసులు అంటూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా ఆ ఇద్దరు అన్నదమ్ములు మారణహోమం సాగిస్తున్నారని, ప్రజలు, ప్రజాస్వామ్యం బతకాలంటే పిన్నెల్లి బ్రదర్స్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ మద్దతుదారుల ఊర్లు తగలబెడుతూ, కుటుంబాలను మట్టుబెడుతోన్న పిన్నెల్లి బ్రదర్స్ అక్రమాలకు చరమగీతం పాడాలని లోకేశ్ పిలుపునిచ్చారు. నోముల మాణిక్యరావు అనే బాధితుడు పిన్నెల్లి సోదరుల అరాచకాల గురించి వివరించిన వీడియోను లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
మరోవైపు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో మాచర్లలో హింస జరిగినా పిన్నెల్లిని అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని విమర్శించారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగినా కేసు లేదని ఆరోపించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని తెలిసినా సరైన బందోబస్తు లేదని, కౌంటింగ్ అయినా నిష్పక్షపాతంగా జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. పిన్నెల్లి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయని, ఆయనను అరెస్ట్ చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.