ఏదైనా కేసులో రాజకీయ నాయకుడు జైలుకు వెళ్లి బయటకు వస్తే సంబరాలు చేసుకోవడం అభిమానులు, అనుచరులకు కామన్ అయిపోయింది. తమ నాయకుడు ఏదో గొప్ప ఘనత సాధించినట్లు, స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నట్లు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఈ తరహా సంబరాలు చేసుకుంటుండం హాస్యాస్పదంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లిని అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో పిన్నెల్లిని అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు పరుగులు తీశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి పిన్నెల్లి పారిపోయారు. ఆయన కోసం తీవ్రంగా గాలించినా లాభం లేకపోయింది. అయితే ఈ లోపు తనకు బెయిల్ కావాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టేమో జూన్ 6 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది. దీంతో న్యాయం గెలిచిందంటూ, పల్నాడు పులి పిన్నెల్లిని ఏం చేయాలేరంటూ ఆయన అనుచరులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
పిన్నెల్లిపై కేసు ఇంకా ముగియలేదు. ఆయనపై వేర్వేరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దోషిగా తేలితే ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయంగా పోటీ చేసేందుకు అనర్హుడవుతారు. ఇప్పుడు జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు తెలిపింది. ఆ తర్వాత ఎలాగో ఈ కేసులో విచారణ జరుగుతుంది. కానీ ఇదంతా మర్చిపోయి తమ నాయకుడు ఏదో పొడిచేసినట్లు కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం ఏమిటో? ఏదేమైనా పిన్నెల్లి చేసింది తప్పు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలకు చోటు ఉండకూడదు. కానీ పిన్నెల్లి పులి అంటూ ఈ పోస్టులు చూస్తుంటే రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయనే ప్రశ్న తలెత్తక మానదు.