ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే పిన్నెల్లిపై జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ముందస్తు బెయిల్ కోరుతు్న మిగతా అభ్యర్థులకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
అయితే, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డిలకు ఈ ఆదేశాలతోపాటు కొన్ని షరతులను హైకోర్టు విధించింది. వీరు తాడిపత్రికి వెళ్ళకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఏ రకమైన క్రిమినల్ చర్యలకు పాల్పడకూడదని హైకోర్టు కండిషన్లు పెట్టింది. వీరి కదలికలపై నిఘా పెట్టాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. వీరి వెంట నలుగురు వ్యక్తులకు మించి తిరగకూడదని షరతు విధించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆదేశాలు, షరతులు వర్తిస్తాయని, అప్పటిదాకా వీరిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.