పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో పిన్నెల్లి ఉన్నారన్న సమాచారంతో అక్కడ ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ అరెస్ట్‌పై పోలీసులు ప్రకటన చేయలేదు. కంది వద్ద పిన్నెల్లి కారును గుర్తించగా అందులో ఆయన లేకపోవడంతో పిన్నెల్లి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈవీఎం విధ్వంసానికి పాల్పడ్డ పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పోలింగ్ నాడు, ఆ తర్వాత పథకం ప్రకారమే పిన్నెల్లి, ఆయన అనుచరులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పి మరీ చేశాడని, పోలీసులకు సవాల్ విసిరి… ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని జూలకంటి మండిపడ్డారు. పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని బ్రహ్మారెడ్డి, దేవినేని ఉమ, వర్ల రామయ్య తదితరులు కోరారు.